
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల 'ఇందిరమ్మ బీమా'
తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది. 2026-27 వార్షిక బడ్జెట్‌లో భాగంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2, 2026 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.
ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందించనున్నారు. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని సుమారు 1 కోటి 15 లక్షల కుటుంబాలు ఈ ప్రయోజనం పొందనున్నాయి. కుటుంబంలో ఆర్థిక భద్రతను పెంపొందించడం, అనుకోని పరిస్థితుల్లో సహాయం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సామాజిక భద్రత కల్పించే దిశగా ఈ పథకం ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.4,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
