
తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్.. ఓటీఆర్ అప్‌డేట్‌కు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. రాబోయే కొత్త నోటిఫికేషన్ల నేపథ్యంలో, అభ్యర్థులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించింది. ఇందుకోసం గతంలో ఉన్న గడువును ఫిబ్రవరి 25, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓటీఆర్ వ్యవస్థలో సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థులు నమోదు అయ్యారని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
నిర్ణీత గడువులోగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపింది.అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే సవరణలు చేయాలని సూచించింది. అలాగే, ఇప్పటివరకు నమోదు చేయని అదనపు అర్హతలు ఉంటే వాటిని కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఓటీఆర్ ప్రక్రియలో భాగంగా అన్ని అవసరమైన సర్టిఫికెట్లు, తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయడం తప్పనిసరి. సర్టిఫికెట్లు స్పష్టంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కమిషన్ హెచ్చరించింది. ఓటీఆర్ అప్డేషన్‌కు గడువును 25-02-2026 వరకు పొడిగించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ గడువు లోపల ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేయని అభ్యర్థులు రాబోయే నియామక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://tgpsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
