Let's talk: editor@tmv.in
తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Gaddamidi Naveen
9 ఏప్రిల్, 2026

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంబేద్కర్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్‌ను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, క్రీడాకారులను అభినందిస్తూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత భావాలను పెంపొందిస్తాయని అన్నారు. అలాగే పార్లమెంట్ వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తాను గట్టిగా పోరాడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి నిధులు కేటాయిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో గత పదేళ్లుగా పాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సరైన న్యాయం చేయడం లేదని విమర్శించారు. ఏపీలో 9 విమానాశ్రయాలు ఉంటే, తెలంగాణలో కేవలం ఒకటే ఉండటం వివక్షకు నిదర్శనమన్నారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సాధించే వరకు పోరాటం ఆపబోనని పేర్కొన్నారు. విశ్రాంత కార్మికులకు కనీసం రూ. 10,000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి భూగర్భంలో పనిచేసే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతోనే తాను ముందుకు సాగుతున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని వంశీకృష్ణ తెలిపారు.