Let's talk: editor@tmv.in
తెలంగాణపై కేంద్రం వివక్ష.. బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణపై కేంద్రం వివక్ష.. బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
2 ఫిబ్రవరి, 2026

కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిలువునా ముంచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ బృందం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి అనేక విజ్ఞప్తులు చేసినా, కేంద్రం ఒక్కటంటే ఒక్క విన్నపాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్‌కు మొండిచేయి.. ముంబైకి పెద్దపీట?

ఈ సంద‌ర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ బయోటెక్ ద్వారా ప్రపంచానికే ప్రాణవాయువు అందించిన హైదరాబాద్ నగరాన్ని ఫార్మా హబ్ కేటాయింపుల్లో పూర్తిగా విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను పక్కన పెట్టడం కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనమని విమర్శించారు. అలాగే, ఆడియో-వీడియో, గేమింగ్ రంగాల్లో దేశానికే దిక్సూచిగా ఎదిగిన హైదరాబాద్‌ను కాదని, ‘ఆరెంజ్ ఎకానమీ’ని ముంబైకి తరలించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది తెలంగాణపై కావాలనే చూపుతున్న నిర్లక్ష్యమా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

రీజినల్ మెడికల్ వ్యాల్యూ హబ్‌ల ఏర్పాటులోనూ తెలంగాణ పేరు లేకపోవడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే చర్యగా ఆయ‌న అభివర్ణించారు. వైద్య రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేంద్రం కావాలనే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రామప్ప దేవాలయం వంటి యునెస్కో వారసత్వ కట్టడాలు, మేడారం వంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన జాతరలు ఉన్నప్పటికీ, తెలంగాణను టూరిజం ప్యాకేజీల్లో చేర్చకపోవడం శోచనీయమని అన్నారు. ఇది రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని నిర్లక్ష్యం చేయడమేనని భ‌ట్టి వ్యాఖ్యానించారు.

సెమీకండక్టర్ పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్రం తోసిపుచ్చి, ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వడం రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమేనని డిప్యూటీ సీఎం అన్నారు. అలాగే, సింగరేణి సంస్థ రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించకపోవడం కూడా సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిరుత్సాహపరిచే విధంగా ఉందని ఆయ‌న విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా, గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేలా కేంద్రం వ్యవహరిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్రం తన ద్రవ్య లోటు పరిమితిని 4.3 శాతానికి పెంచుకుంటూ, రాష్ట్రాలకు మాత్రం 4 శాతం అనుమతి నిరాకరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

ఎంపీలకు పిలుపు - పునరాలోచించాలన్న విజ్ఞప్తి

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర లక్ష్యానికి కేంద్రం తోడ్పాటు అందించాల్సిందని, కానీ నిర్లక్ష్యం చేయడం వికసిత్ భారత్ లక్ష్యానికి ఆటంకమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులందరూ ఈ అన్యాయంపై గళమెత్తాలని, పార్లమెంట్‌లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కక్షసాధింపులు పక్కన పెట్టి, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

తెలంగాణకు మళ్లీ 'సున్నా': కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త‌న ఎక్స్ వేదిక ద్వారా స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అనే నినాదాల వెనుక తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షా పూరిత వాస్తవాలు దాగి ఉన్నాయని ఆమె విమర్శించారు. వరుసగా 12వ బడ్జెట్‌లోనూ తెలంగాణకు నిరాశే ఎదురైందని, రాష్ట్ర హక్కులను నిరాకరించడాన్నే కేంద్రం క్రమశిక్షణగా భావిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.

బడ్జెట్‌లో పట్టణ భారతాన్ని పూర్తిగా విస్మరించారని, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ నిధులు నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ప్రాంతీయ రింగ్ రోడ్ కు సంబంధించిన రూ.34,367 కోట్ల నిధులు, జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధి అన్నీ ఫైళ్లలోనే ఉన్నాయని అన్నారు. కొత్త రైల్వే లైన్లు అనుమతుల దశలోనే నిలిచిపోయాయని, రైల్వే కనెక్టివిటీ అడ్డంకులకు గురైందని చెప్పారు.

విద్యారంగంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఐఐఎం హైదరాబాద్, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని పక్కన పెట్టడంతో యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆమె విమర్శించారు. సాగునీరు, గృహనిర్మాణం, ఆర్థిక వృద్ధిపై ప్రకటనలే తప్ప నిధుల కేటాయింపులు లేవన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు ఇంకా పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు.

మెట్రో ఫేజ్-2లో కేంద్రం ఇవ్వాల్సిన 50 శాతం వాటా రాకపోవడం, ఎనర్జీ రంగానికి మద్దతు నిలిచిపోవడం, పరిశ్రమలకు ప్రోత్సాహం లేకపోవడం తెలంగాణపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత అన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లినా, రాష్ట్రానికి నిధులు మాత్రం శూన్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తి కూడా కాదని, తెలంగాణను వెనుక వరుసకు నెట్టేస్తున్నారని కవిత తీవ్రంగా విమర్శించారు.