
తెలంగాణను దేశానికే ఆదర్శంగా మారుస్తాం: సీఎం
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి, ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్‌ను త్వరలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో ప్రస్తుతం నంబర్ 1 గా ఉన్న తెలంగాణను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. 'ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు'లో భాగంగా ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో వంద దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పేదవారందరికీ అత్యుత్తమ సంక్షేమ పథకాలను అందించడం ముఖ్యంగా పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మాత్రమే సార్థకత సాధించబడతుందని. తెలంగాణలో నిరుపేదలకు ఇస్తున్న సన్నబియ్యం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లభించదని, ఈ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ‘ఇందిరమ్మ ఇళ్ల’ను, అదనంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో 25,000 ఇళ్లను మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు.
మద్దిమడుగులో గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు అతిపెద్ద సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఉత్తమ పార్లమెంటేరియన్ ఎస్ జైపాల్ రెడ్డి చదివిన పాఠశాల అభివృద్ధికి 6 కోట్లు, వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక బాధ్యత, దేవరకొండకు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి ముఖ్యమైన పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.ఈ పర్యటనలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇలా ఉన్నాయి.
• రూ. 13 కోట్లతో మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణం
• రూ. 2.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
• రూ. 50 లక్షలతో సీసీ డ్రైన్లు
• రూ. 2 కోట్లతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ట్రాక్ అభివృద్ధి
• రూ. 2 కోట్లతో బీఎన్ఆర్ పార్క్ అభివృద్ధి
• రూ. 11.33 కోట్లతో బ్యాంక్ లింకేజీ చెక్కులను మహిళా సంఘాలకు అందజేత
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెలాఖరులోపు మంత్రులను జిల్లాకు పంపి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
