Let's talk: editor@tmv.in
తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Gaddamidi Naveen
15 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సందర్శించారు. రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే పూర్తయిన ఈ భారీ కర్మాగారాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం విస్తరిస్తోందన్నారు. తెలంగాణను దేశంలో ప్రముఖ ఆయిల్ పామ్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఒకసారి నాటితే 25 నుంచి 30 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం అందించే పంటగా ఆయిల్ పామ్ రైతులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుందని మంత్రి చెప్పారు.

ఆయిల్ పామ్ తోటల్లో కోకో, జాజికాయ, మెకాడామియా వంటి అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రైతులు ఫ్యాక్టరీకి పండించిన గెలలను విక్రయించిన తర్వాత మూడు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని, మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కోతులు, అడవి పందులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈ పంటకు ముప్పు తక్కువని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ రాయితీలు, మద్దతు

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 50,921 వరకు రాయితీని అందిస్తోంది. మొక్కలను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు టన్ను ధర రూ. 12,000 ఉండగా, కేంద్రంతో చర్చించి దిగుమతి సుంకం పెంచడం వల్ల ప్రస్తుతం ధర రూ. 21,546 కు చేరిందని, దీనిని రూ. 25,000 కు పెంచాలని ప్రధానిని కోరామని తుమ్మల తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నర్మెట్టలో ఏర్పాటైన ఈ ఆధునిక ఫ్యాక్టరీ ప్రాంతీయ రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై ఉన్న అపోహలు తొలగుతున్నాయని, ఇది రైతులకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటగా మారే అవకాశముందని చెప్పారు. రైతులు ఆయిల్ పామ్ సాగును ఎక్కువగా చేపట్టాలని ఆయన సూచించారు.

పంట మార్పిడి ఆవశ్యకత

రాష్ట్రంలో ప్రస్తుతం వరి సాగు పెరిగిందని, అయితే కేంద్రం సేకరణ పరిమితుల దృష్ట్యా రైతులు ఉద్యానవన పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. నర్మెట్ట ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మలేషియా ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ గంటకు 30 నుంచి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీ యూనిట్లతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యం గల బయో-పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ నీటి శుద్ధి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. అందులో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలోనే దాదాపు 42,758 మంది రైతులు 1.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త ఫ్యాక్టరీ ప్రారంభంతో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించే అవకాశముందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.