Let's talk: editor@tmv.in
తెలంగాణ-జర్మనీ సహకారంపై కీలక భేటీ

తెలంగాణ-జర్మనీ సహకారంపై కీలక భేటీ

Gaddamidi Naveen
13 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రం, జర్మనీ మధ్య విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా, ప్రజా భవన్‌లో జర్మన్ పార్లమెంట్‌ ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రతినిధులు సమావేశమయ్యారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి ఈ సమావేశంలో తెలంగాణలోని ముఖ్య రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ఐటీ, రక్షణ, ఔషధ తయారీ రంగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి నవకల్పన, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అభివృద్ధి ద్వారా పరస్పర వృద్ధిని పెంపొందించుకోవడానికి భాగస్వామ్యం వహించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తెలంగాణ యొక్క సాంకేతిక పారిశ్రామిక వ్యవస్థను జర్మనీకి వివరించారు.జర్మన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలపై చర్చ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీలు, పారదర్శక వ్యవస్థలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం, ప్రతిభావంతులైన యువత సమృద్ధిగా ఉండటం వంటి బలాలకు గుర్తింపు లభించిందన్నారు. జర్మనీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ద్వైపాక్షిక సహకారం ద్వారా ఇరు ప్రాంతాలకూ ప్రయోజనం చేకూరుతుందని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జర్మన్ ప్రతినిధులు తెలంగాణలో వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ వాతావరణం, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఇన్నోవేషన్ హబ్‌లు, పరిశోధన,ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిని ప్రశంసించారు. ప్రత్యేకించి, ఐటీ రంగంలో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన మానవవనరులు, ఔషధ పరిశ్రమలో హైదరాబాద్‌ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు, అలాగే రక్షణ తయారీ రంగంలో రాష్ట్రం చూపుతున్న ఆసక్తి ఈ అంశాలు భవిష్యత్ భాగస్వామ్యానికి పెద్ద అవకాశాలని ప్రతినిధి బృందం అభిప్రాయపడింది.