Let's talk: editor@tmv.in
తెలంగాణకు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరం: భట్టి విక్రమార్క

తెలంగాణకు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరం: భట్టి విక్రమార్క

Pinjari Chand
30 నవంబర్, 2025

ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ పడుతుంది. వారి సరసన మనం నిలబడాలంటే తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై భారీ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రానికి 1,39,310 మెగావాట్ల (దాదాపు 1.40 లక్షల మెగావాట్లు) పీక్ డిమాండ్ వస్తుందని, ఇప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోతే రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో పడుతుందని హెచ్చరించారు.

ముఖ్యాంశాలు

• 2047లో 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే ఏటా 13శాతం జీఎస్డీపీ వృద్ధి సాధించాలి, 10శాతం విద్యుత్ డిమాండ్ వృద్ధి తప్పనిసరి.

• 2025-26లో 18,826 మెగావాట్లు

• 2034-35లో 48,000 మెగావాట్లు

• 2047లో 1.40 లక్షల మెగావాట్లు.

• కాంగ్రెస్ వచ్చాక ఒక్కసారిగా 10శాతం డిమాండ్ పెరిగింది. ఇది ఆర్థిక కార్యకలాపాలు, పరిశ్రమల రాకకు సూచిక.

• గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎనర్జీ స్టోరేజ్ (బ్యాటరీ + పంప్డ్ స్టోరేజ్)పై ఒక్క ప్లాన్ కూడా లేదు. ప్రస్తుత స్టోరేజ్ సామర్థ్యం – సున్నా (0 మెగావాట్లు).

• 2034-35 నాటికి కనీసం 43,918 మెగావాట్ల అదనపు గ్రీన్ ఎనర్జీ (సోలార్+విండ్+పంప్డ్ స్టోరేజ్) కావాలి.

• దేశంలోనే తెలంగాణకు అత్యధిక సోలార్ కెపాసిటీ అవసరం (24,783 మెగావాట్లు) కానీ ప్రస్తుత ఇన్-స్టేట్ సోలార్ మాత్రమే 707-800 మెగావాట్లు.

• థర్మల్, విండ్, సోలార్, స్టోరేజ్ – అన్ని రంగాల్లోనూ 2028-29 నుంచి భారీ డెఫిసిట్ రానుంది.

స్పష్టమైన హామీ ఇచ్చిన భట్టి

పెట్టుబడిదారులకు మూడు గ్యారంటీలు ఇచ్చారు. అందులో నీరు, 24×7 విద్యుత్, చట్టం-వ్యవస్థ. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, రీజియనల్ రింగ్ రోడ్, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లతో హైదరాబాద్‌ను సింగపూర్-షాంఘై స్థాయి గ్లోబల్ హబ్‌గా మారుస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. తెలంగాణలో పరిశ్రమలు పెట్టాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

10-15 ఏళ్లుగా ఎనర్జీ స్టోరేజ్‌పై దృష్టి పెట్టలేదు. దీర్ఘకాలిక ప్లానింగ్ లేకపోవడంతో రాష్ట్రం ఇప్పుడు తీవ్ర సంక్షోభం వైపు నడుస్తోంది. మేం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పని చేస్తున్నాం అని భట్టి వివరించారు. 2047 లక్ష్యం సాధ్యమే కానీ ఇప్పటి నుంచే 15-20 ఏళ్ల ముందు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.