Let's talk: editor@tmv.in
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లును ఒకేసారి కేటాయించాలి: కేంద్ర మంత్రికి పొంగులేటి విజ్ఞప్తి

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లును ఒకేసారి కేటాయించాలి: కేంద్ర మంత్రికి పొంగులేటి విజ్ఞప్తి

Gaddamidi Naveen
13 ఆగస్టు, 2026

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పీఎంఏవై-జీ 2.0) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఒకే విడతలో 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఆయన, ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖను గుర్తుచేస్తూ, రాష్ట్రానికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సర్వే పూర్తయినా.. కేటాయింపుల కోసం ఎదురుచూపులు

‘ఆవాస్‌ ప్లస్‌–2024’ యాప్‌ ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించినట్లు పొంగులేటి తెలిపారు. ఈ సర్వేలో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా గుర్తించబడ్డాయని చెప్పారు. అనర్హుల తొలగింపు, సూపర్‌ చెక్‌ ప్రక్రియలు ఏడాది క్రితమే పూర్తయినా.. కేంద్రం నుంచి ఇళ్ల లక్ష్యాల కేటాయింపు ఇంకా జరగలేదన్నారు. గత 12 ఏళ్లుగా తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో భారీగా పెండింగ్‌ డిమాండ్‌ ఏర్పడిందని తెలిపారు. అందువల్ల అర్హులైన కుటుంబాలన్నింటికీ ఒకే విడతలో ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సాయం

పేద కుటుంబాలు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుందని పొంగులేటి చెప్పారు. ఈ సాయం కేంద్ర నిధులు, పీఎంఏవై-జీ కింద రాష్ట్ర వాటాకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు.

తెలంగాణ పర్యటనకు ఆహ్వానం

తెలంగాణకు వచ్చి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పొంగులేటి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చి పీఎంఏవై-జీ 2.0 కింద ఇళ్ల కేటాయింపును ప్రకటిస్తే గ్రామీణ పేదలకు ఎంతో భరోసా కలుగుతుందని, అది చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దీనికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సానుకూలంగా స్పందించి తెలంగాణ పర్యటనకు అంగీకరించారు.

ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, వేం, నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్‌, రామసహాయం రఘురామ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.పి. గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లును ఒకేసారి కేటాయించాలి: కేంద్ర మంత్రికి పొంగులేటి విజ్ఞప్తి - Tholi Paluku