
తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్.. 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత తీవ్రంగా తలపించేలా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే 7 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించనున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరనున్నాయి.
రాజధాని నగరంలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. వచ్చే వారం రోజుల పాటు వరుసగా 40°C నుంచి 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో సగటున 41°C నుంచి 43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఎండలో బయటకు రాకుండా ఉండటం మంచిది.
