Let's talk: editor@tmv.in
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

Aravind Maryada Reddy
7 అక్టోబర్, 2025

ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నది. దాదాపుగా 9 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కంపెనీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, ఎలిలిల్లీ కంపెనీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సమావేశంలో ఎలి లిల్లీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్నెలో టూకర్‌తో పాటు ఇతర ప్రతినిధులు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

తయారీ రంగాన్ని విస్తరిస్తాం

ఈ సందర్భంగా ఎలి లిల్లీ సంస్థ హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని తమ తయారీ రంగ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో హైదరాబాద్ నుంచి తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణపై విశ్వాసం ఉంచినందుకు కంపెనీని అభినందిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఫార్మా హబ్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ఫార్మా హబ్‌గా పేరొందిందని చెప్పారు. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. 1965లో ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చినప్పటి నుంచి ఫార్మా రంగం ఇక్కడ విస్తరించిందని, ప్రస్తుతం దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు

ఎలి లిల్లీ హైదరాబాద్‌లో చేపట్టనున్న పెట్టుబడులు పెట్టడంతో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు, మేనేజ్‌మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలకు త్వరలోనే అవకాశం కల్పించనున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికాకు చెందిన ఎలి లిల్లీ సంస్థ డయాబెటిస్, ఒబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీ, కొత్త ఆవిష్కరణలపై పని చేస్తోంది. ఇండియాలో గురుగ్రామ్, బెంగళూరులో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎలి లిల్లీ విస్తరణతో తెలంగాణలో ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

ఎలీ లిల్లీ సంస్థ వివరాలు

ఎలీ లిల్లీ అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఔషధ కంపెనీ. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడిని ప్రకటించింది. సుమారుగా రూ.9,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌లో కొత్త ఔషధ ఉత్పత్తి, మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్ ఏర్పాటుచేయాలని చేయబోతున్నారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థ తన భారత్‌లో వినియోగం పెంచుకోనున్నది. హైదరాబాద్‌లో ఒక గ్లోబర్ క్యాపబులిటీ సెంటర్‌ను ప్రారంభించింది. 2026–27 కాలంలో ఈ సంస్థ ద్వారా 1,500 ఉద్యోగ కల్పన జరగబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త కంపెనీ కోసం కొత్త ఫ్యాక్టరీ, ఉత్పత్తి కేంద్రాలు, ఇతర అనుబంధ కార్యకలాపాలు జరగనున్నాయి. ఇంజనీరులు, రసాయన శాస్త్రజ్ఞులు, విశ్లేషణ శాస్త్రవేత్తలు అవసరం పడొచ్చు. దీంతో ఆయా రంగాల నిపుణులకు అవకాశాలు పెరిగనున్నాయి. కంపెనీ పూర్తి స్థాయిలో విస్తరిస్తే మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - Tholi Paluku