
తెలంగాణకు మరో ‘అమృత్ భారత్’ రైలు
నగరంలోని చర్లపల్లి టెర్మినల్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణకు ఇది రెండో అమృత్ భారత్ రైలు (మొదటిది చర్లపల్లి - ముజఫర్‌పూర్ మధ్య నడుస్తోంది). ఈ కొత్త రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం 10.45 గంటలకు తిరువనంతపురం నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
ప్రయాణ సమయాలు, రైలు నంబర్లు
ఈ రైలు వారానికి ఒకసారి (వీక్లీ) నడుస్తుంది. సాధారణ రోజుల్లో దీని షెడ్యూల్ ఇలా ఉంటుంది. చర్లపల్లి-తిరువనంతపురం (రైలు నం.17041): ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరువనంతపురం-చర్లపల్లి (రైలు నం.17042): ప్రతి గురువారం రాత్రి 11.30 గంటలకు తిరువనంతపురంలో బయలుదేరి, శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుంది?
హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ రైలు మొత్తం 1488 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 31 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 29 ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అక్కడి నుండి తమిళనాడులోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు మీదుగా ప్రయాణించి.. చివరగా కేరళలోని పాలక్కాడ్, ఎర్నాకులం, కొట్టాయం, కొల్లం వంటి ముఖ్యమైన ప్రాంతాల గుండా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
అమృత్ భారత్ రైలు ప్రత్యేకతలు ఇవే!
సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో విమాన ప్రయాణంలాంటి అనుభూతి ఇవ్వడమే ఈ రైలు ప్రధాన లక్ష్యం. ఈ రైలులో పుష్–పుల్ టెక్నాలజీ ఉంది. అంటే రైలుకు ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉండటం వల్ల ప్రయాణం వేగంగా సాగడంతో పాటు కుదుపులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ రైలులో మొత్తం 8 స్లీపర్ కోచ్‌లు, 11 జనరల్ కోచ్‌లు ఉంటాయి. ఏసీ కోచ్‌లు లేకపోయినా ప్రయాణం మాత్రం చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఫోల్డబుల్ స్నాక్స్ టేబుల్స్, మొబైల్ హోల్డర్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రాత్రి ప్రయాణంలో దారి స్పష్టంగా కనిపించేలా రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, అలాగే ఆధునిక టాయిలెట్లు ఉన్నాయి. అంతేకాకుండా దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఈ రైలులో అందుబాటులో ఉన్నాయి.
భక్తులకు పెద్ద పీట
ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల కేరళలోని శబరిమల (అయ్యప్ప స్వామి), గురువాయూర్, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు భక్తులకు గొప్ప వెసులుబాటు కలగనుంది. ప్రయాణికుల కోసం రైలులోనే ప్యాంట్రీ కార్ సౌకర్యం కూడా ఉంది. ఈ రైలు కేటాయించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోడీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
