Let's talk: editor@tmv.in
తెలంగాణకు మరిన్ని ఐఏఎస్ పోస్టులు

తెలంగాణకు మరిన్ని ఐఏఎస్ పోస్టులు

Pinjari Chand
15 జనవరి, 2026

తెలంగాణలో పెరుగుతున్న పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పరిపాలనా సేవల (ఐఏఎస్) తెలంగాణ కేడర్ అధికారిక బలాన్ని 208 నుంచి 218 పోస్టులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పులు భారత పరిపాలనా సేవల (కేడర్ బల నిర్ధారణ) సవరణ నిబంధనలు–2026 కింద చేపట్టినవని, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సవరించిన నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ డ్యూటీ పోస్టులను 119గా నిర్ణయించారు.

కేడర్ నిర్మాణంలో ఉన్న మొత్తం పోస్టులు ఇలా:

• కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్ – 47 పోస్టులు

• రాష్ట్ర డిప్యూటేషన్ రిజర్వ్ – 29 పోస్టులు

• ట్రైనింగ్ రిజర్వ్ – 4 పోస్టులు

• లీవ్ రిజర్వ్, జూనియర్ పోస్టుల రిజర్వ్ – 19 పోస్టులు

మొత్తం 218 ఐఏఎస్ పోస్టుల్లో

66 పోస్టులను ఐఏఎస్ (రిక్రూట్‌మెంట్) నిబంధనలు–1954లోని రూల్–8 ప్రకారం పదోన్నతుల ద్వారా, 152 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ సవరించిన నిబంధనలు ఈ నెల జనవరి 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్) స్పష్టం చేసింది. అఖిల భారత సేవల చట్టం–1951, ఐఏఎస్ కేడర్ నిబంధనలు–1954 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వినియోగించి ఈ సవరణలు చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలకు భారత పరిపాలనా సేవల (కేడర్ బల నిర్ధారణ) సవరణ నిబంధనలు–2026 అని పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న పరిపాలనా పనిభారం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాల అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐఏఎస్ కేడర్ బలాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడిందని అధికారులు తెలిపారు. పరిపాలనను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.