
తెలంగాణకు పోటెత్తిన ‘గ్లోబల్’ పెట్టుబడులు
హైదరాబాద్ సమీపంలో జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' రెండో రోజున, తెలంగాణ ప్రభుత్వం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, హెటెరో, భారత్ బయోటెక్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి రూ.1 లక్ష కోట్ల కంటే ఎక్కువ విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది.
సమిట్ మొదటి రోజున రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు ప్రత్యక్షమవగా, రెండో రోజు మరో కీలకమైన రూ.1,04,350 కోట్ల పెట్టుబడులు ఖరారు కావడంతో మొత్తం పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తెలంగాణలో 100 ఎకరాల్లో పానీయాలు, స్నాక్స్, కాంఫెక్షనరీ తదితర ఉత్పత్తుల తయారీకి మల్టీ–ప్రొడక్ట్ ఎఫ్‌ఎంసీజీ యూనిట్‌ను స్థాపించనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించబడనున్నాయి. వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్, ఎగుమతి ఉద్దేశంతో ప్రీమియం ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్‌ను విస్తరించేందుకు రూ.1,100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
జెకెసీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డేటా సెంటర్లు అనుబంధ సేవలను అభివృద్ధి చేసేందుకు రూ.9,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,000కిపైగా ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఆర్‌సిటి ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు దశల్లో రూ.2,500 కోట్లు పెట్టి 1,600కుపైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నది. హెటెరో గ్రూప్ రాష్ట్రంలో భారీ ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించింది. రూ.1,800 కోట్ల పెట్టుబడితో వచ్చే రెండేళ్లలో 9,000కు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సిద్ధం కానున్నాయి.
భారత్ బయోటెక్, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఔరోబిందో ఫార్మా క్లిష్టమైన జెనరిక్స్, ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ వంటి విభాగాల్లో తన సామర్థ్యాలను పెంచేందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేసింది. దీంతో వచ్చే రెండేళ్లలో 3,000కుపైగా ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. రెండో రోజు మొత్తం పెట్టుబడులు రూ.1,04,350 కోట్లుగా నమోదైనట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం: సీఎం
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను ప్రభుత్వం సమగ్రంగా అందించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ సమీపంలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక స్టూడియోలను స్థాపించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో రోజు “సృజనాత్మక శతాబ్దం వినోద రంగం భవిష్యత్తు” అనే అంశంపై జరిగిన చర్చల్లో సినిమా పరిశ్రమ ప్రముఖులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వేంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి, రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, జెనీలియా దేశ్‌ముఖ్, అమల అక్కినేని, అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండే తదితరులు ఈ భేటీలో ముఖ్యంగా పాల్గొనడం విశేషం.
స్క్రిప్ట్‌తో ప్రభుత్వాన్ని ఆశ్రయించే చిత్రబృందాలకు పూర్తి స్థాయిలో సినిమా నిర్మాణం పూర్తిచేసుకునే విధంగా పరిశ్రమకు అవసరమైన అన్ని అనుమతులు, సేవలు సింగిల్-విండో విధానంలో అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సినిమా నిర్మాణాలకు అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అలాగే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్‌లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రొఫెషనల్ శిక్షణ అందించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
