
తెలంగాణకు తీవ్ర శీతలగాలుల హెచ్చరిక: ఉష్ణోగ్రతలు 6°C వరకు పడిపోయే అవకాశం
తెలంగాణ ప్రజలు వచ్చే వారం రోజులు భయంకరమైన చలికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 7 నుంచి 16 వరకు రాష్ట్రంలో ఇంటెన్స్ కోల్డ్‌వేవ్ ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13 వరకు కోల్డ్‌వేవ్ అత్యంత తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తాజా నివేదికలు చేస్తున్నాయి.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, పింక్ కలర్‌గా గుర్తించిన జిల్లాలలో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 6°C నుంచి 9°C వరకు పడిపోవచ్చు. సాధారణంగా కొండప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు ఈ వర్గంలోకి వచ్చే అవకాశం ఉంది. బ్లూ మార్క్ చేసిన జిల్లాలలో అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9°C నుంచి 12°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఉదయం వేళ చలి తీవ్రంగా ఉండడంతో చేతులు, కాళ్లు గడ్డకట్టే స్థాయి చలి నమోదు కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే, పగటిపూట వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉండనుంది. మధ్యాహ్నం సమయంలో ఆకాశం నిర్మలంగా, ఎండప్రకాశం సాధారణంగా కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు సగటు స్థాయిలోనే ఉండనున్నప్పటికీ, సాయంత్రం తర్వాత వేగంగా చలి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెద్దలు, చిన్నపిల్లలు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాకెట్లు, వూలెన్ దుస్తులు ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాయంత్రం నుంచి ఉదయం వరకు గరిష్ఠ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. చలిగాలుల ప్రభావం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ వేడి నీరు, వేడి ఆహారం తీసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని అధికారులు కోరుతున్నారు.
