Let's talk: editor@tmv.in
తెలంగాణకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు

తెలంగాణకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు

Gaddamidi Naveen
15 డిసెంబర్, 2025

ఇంధన సంరక్షణ ఇంధన సామర్థ్యం రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పనితీరు కనబరిచి, ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు – 2025 లో రాష్ట్ర పనితీరు విభాగంలో రెండో బహుమతిని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానాన్ని సాధించి బహుమతి అందుకుంది. ఈ అవార్డును భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ అందిస్తుంది.

ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీఆర్‌ఈడీసీఓ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వి. అనిల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది.

ఈ అవార్డు తెలంగాణ రాష్ట్రంలో శక్తి పరిరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర నూతనీకరణీయ శక్తి అభివృద్ధి సంస్థ కృషికి గుర్తింపుగా నిలిచింది. రాష్ట్రానికి స్టేట్ డిజైనేటెడ్ ఏజెన్సీగా టీజీఆర్‌ఈడీసీఓ కీలక పాత్ర పోషిస్తోంది.

తెలంగాణ అమలు చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో హైదరాబాద్ యూనివర్సిటీలో చేపట్టిన కూల్ రూఫ్ డెమో ప్రాజెక్ట్ ప్రాధాన్యత కలిగి ఉంది. 36,746 చదరపు అడుగుల విస్తీర్ణంలో అమలు చేసిన ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి సుమారు 7,000 యూనిట్ల విద్యుత్ ఆదా జరుగుతోంది. పట్టణ వేడి ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవనాల్లో ఉష్ణ సౌకర్యాన్ని మెరుగుపరచడంలో ఇది దోహదపడిందని పేర్కొన్నారు.

రాష్ట్ర శక్తి పరిరక్షణ నిధి కింద 600 ఇండక్షన్ కుక్‌టాప్స్, 600 ఇండక్షన్ ప్రెజర్ కుక్కర్లు పంపిణీ చేయడంతో పాటు, టీజీఆర్‌ఈడీసీఓ, డిస్కాంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రుణ పథకంను ప్రారంభించారు. అలాగే స్టాండర్డ్స్ & లేబెలింగ్ కార్యక్రమం కింద 870 నమూనాల మార్కెట్ సర్వైలాన్స్, 27 నమూనాల చెక్ టెస్టింగ్ ఎన్ఏబీఎల్ ల్యాబ్‌ల ద్వారా నిర్వహించారు.

ఎనర్జీ కన్జర్వేషన్ & సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ –2025, ఈఎన్ఎస్–2025 అమలులో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది. సుమారు 1,178 ఈసీబీసీ అనుసరణ భవనాల ద్వారా సంవత్సరానికి 412.25 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా సాధ్యమవుతోంది. పీఏటీ పథకం కింద ఎనిమిది రంగాల్లో 43 డిజైనేటెడ్ కన్జ్యూమర్లకు 3.03 లక్షల ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని పేర్కొంది. ఇవి అన్నీ తెలంగాణ క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025 లక్ష్యాలకు అనుగుణంగా, పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, పెట్టుబడులు, ఉపాధి సృష్టికి దోహదపడుతున్నాయి.

ఈ జాతీయ అవార్డు తెలంగాణ శక్తి సామర్థ్యం, సుస్థిర అభివృద్ధిలో నాయకత్వాన్ని చాటుతోంది. ఈ సందర్భంగా టీజీఆర్‌ఈడీసీఓ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రం కోసం శక్తి పరిరక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేసింది.

తెలంగాణకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు - Tholi Paluku