
తెలంగాణకు కేంద్రం పూర్తి మద్దతు: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గత వారం రోజుల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన ఉదహరించారు. అబద్ధపు ప్రచారాల కంటే వాస్తవాలే ముఖ్యం అని పేర్కొంటూ ఆయన ఎక్స్ వేదికగా వివరాలను వెల్లడించారు.
తెలంగాణ రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం రూ.884 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల మినుములు, పొద్దుతిరుగుడు వంటి పంటలను సేకరించనున్నారు. పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద రాష్ట్రానికి కొత్తగా 18,213 ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించినట్లు తెలిపారు.
రైల్వే రంగంలో కూడా రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తూ చెర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్, కామాఖ్య వరకు రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రకటించినట్లు చెప్పారు. అంతేకాక ములుగు జిల్లాలోని రెండు చారిత్రక దేవాలయాలను ఏఎస్ఐ సంరక్షణలో జాతీయ స్మారక చిహ్నాలుగా ప్రకటించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్–పనాజీ ఆర్థిక కారిడార్‌లో భాగంగా గుడేబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి 167 విస్తరణకు రూ.3,175 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాల్లో నిరంతర మద్దతు పొందుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
