
తెలంగాణ–ఈశాన్య రాష్ట్రాల మధ్య బంధం మరింత బలపడనుంది: గవర్నర్
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిఘ్ణ దేవ్ వర్మతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సెంటర్‌ను అలాగే మూవీ స్క్రీనింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈశాన్య రాష్ట్రాలు పర్యావరణ సంపద, సాంస్కృతిక వైవిధ్యం, శాంతి, సహజీవన పరంపరలతో ప్రత్యేకతగలవి. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఈశాన్య ప్రాంతాలవారి పాత్ర చాలా ముఖ్యమని రాష్ట్ర గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఈశాన్య వర్గానికి తెలంగాణ ఒక కుటుంబం కాబట్టి వారి సంప్రదాయాలను గౌరవించడం, వాటిని ప్రోత్సహించడం అనేది రాష్ట్రం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ రెండు రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ–ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడుతుందని, యువత, సినీ రంగ ప్రముఖులు, కళాకారులు ఈ ఫెస్టివల్ ద్వారా ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఇరు ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహన సాన్నిహిత్యాన్ని పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రి వాకిటి శ్రీహరి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
