
తూర్పు నేపాల్‌లో వర్ష బీభత్సం
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు నేపాల్ తూర్పు ప్రాంతంలోని కోషి ప్రావిన్స్‌లో తీవ్రమైన విధ్వంసం సృష్టించాయి. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల కొండపైనుండి రాళ్ళు, మట్టి జారిపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఇలామ్ జిల్లా సూర్యోదయ మునిసిపాలిటీలోని మానేభాంజ్యాంగ్ ప్రాంతంలో ఐదుగురు మృతి చెందగా పాటేగావ్, మన్సేబుంగ్, దేవుమా, ధుసుని, రత్మటే, ఘోసాంగ్ ప్రాంతాల్లో మరో తొమ్మిది మంది మృతిచెందారు. కొందరు గల్లంతైన కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు రక్షణ చర్యల కోసం నేపాల్ సైన్యం హెలికాప్టర్‌ను పంపించగా, సైనిక దళాలను కూడా అక్కడికి తరలించారు. అయితే వర్షం ఆగకపోవడం, పొగమంచు ఎక్కువగా ఉండటంతో శోధన, రక్షణ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నాయి. రహదారులు బురదతో మూసుకుపోవడం, గ్రామాల మధ్య రవాణా పూర్తిగా ఆగిపోవడం స్థానిక ప్రజలను కష్టాల్లోకి నెట్టింది.
మరిన్ని ప్రాంతాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం కోషి, మధేశ్, బాగ్మతి, గండకి, లుంబిని ప్రావిన్స్‌లలో మాన్సూన్ వ్యవస్థ చురుకుగా ఉండటంతో వరదలు, భూస్ఖలనాల ముప్పు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది.
ఇక ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించింది. ఆహారం, ఔషధాలు, తాత్కాలిక నివాస వసతులు వంటి సహాయక సామగ్రిని అత్యవసరంగా బాధిత గ్రామాల్లో పంపిస్తున్నట్లు సమాచారం. ప్రాణాలను కాపాడడం రవాణా సౌకర్యాలను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి.
