Let's talk: editor@tmv.in
తూర్పు నాగాలాండ్ కల సాకారం: స్వయంపాలన దిశగా అడుగులు

తూర్పు నాగాలాండ్ కల సాకారం: స్వయంపాలన దిశగా అడుగులు

Dantu Vijaya Lakshmi Prasanna
7 ఫిబ్రవరి, 2026

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక డిమాండ్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (ఎఫ్ఎన్‌టిఏ) ఏర్పాటు కోసం కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఈ ప్రాంత అభివృద్ధి పథాన్ని మారుస్తుందని, ఈశాన్య భారతంపై తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ, "ఈ ఒప్పందం తూర్పు నాగాలాండ్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని, వారికి మరిన్ని అవకాశాలను, శ్రేయస్సును అందిస్తుందని" ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సమక్షంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయింది.

ఈ కొత్త ఒప్పందం ప్రకారం, నాగాలాండ్‌లోని ఆరు వెనుకబడిన జిల్లాలు, ట్యూన్‌సాంగ్, మోన్, కిఫిరే, లాంగ్‌లెంగ్, నోక్లాక్, శామటోర్, ఇకపై ఎఫ్ఎన్‌టిఏ పరిధిలోకి వస్తాయి. పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి కోసం సుమారు 46 కీలక అంశాలకు సంబంధించిన అధికారాలను ఈ అథారిటీకి బదిలీ చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా స్థానిక స్వయంప్రతిపత్తి పెరగడమే కాకుండా, ఈ ప్రాంతంలో శాంతి, సమగ్ర వృద్ధికి బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీకి బదిలీ చేసిన 46 కీలక అంశాలలో ప్రధానంగా స్థానిక అభివృద్ధి, పరిపాలన, సామాజిక భద్రతకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన అంశాలు విద్య (ప్రాథమిక, ఉన్నత), ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రజా పనుల శాఖ (రోడ్లు, మౌలిక సదుపాయాలు), గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, వరద నియంత్రణ, అటవీ పర్యావరణం, సామాజిక సంక్షేమం, పశుసంవర్ధక శాఖ, భూ సంస్కరణలు.

ఈ అధికారాల బదిలీ ద్వారా తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలకు తమ సొంత బడ్జెట్‌ను ప్లాన్ చేసుకునే, అమలు చేసే స్వయంప్రతిపత్తి లభిస్తుంది. ఉదాహరణకు, పాఠశాలల నిర్వహణ, ఆసుపత్రుల సౌకర్యాలు, స్థానిక రోడ్ల నిర్మాణం వంటి కీలక నిర్ణయాల కోసం వారు ఇకపై రాష్ట్ర రాజధాని కోహిమాపై పూర్తిస్థాయిలో ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ 46 అంశాలపై స్వతంత్ర నిర్ణయాధికారం ఉండటం వల్ల, ఆ ప్రాంతంలోని తెగల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూనే, అభివృద్ధి పనులను వేగవంతం చేసే అవకాశం ఈ అథారిటీకి కలుగుతుంది.

కాగా, నాగాలాండ్‌లో దశాబ్దాలుగా ఉన్న ప్రధాన ప్రత్యేక డిమాండ్ "ప్రత్యేక రాష్ట్రం" లేదా “స్వయంప్రతిపత్తి"కి సంబంధించింది. ముఖ్యంగా తూర్పు నాగాలాండ్‌కు చెందిన ఆరు జిల్లాలు (ట్యూన్‌సాంగ్, మోన్, కిఫిరే, లాంగ్‌లెంగ్, నోక్లాక్, శామటోర్) దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్ర వివక్షకు గురవుతున్నామని వాదిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలు తమ అభివృద్ధి కోసం 'ఫ్రంటియర్ నాగాలాండ్' అనే పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు.

ఈ డిమాండ్ వెనుక ఉన్న ప్రధాన కారణం అధికార వికేంద్రీకరణ, నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తమ ప్రాంతం మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉందని అక్కడి ప్రజల ఆవేదన. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 'ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇది ప్రత్యేక రాష్ట్రం కాకపోయినప్పటికీ, ఆ ఆరు జిల్లాలకు పరిపాలనాపరంగా, ఆర్థికంగా గణనీయమైన స్వయంప్రతిపత్తిని, అలాగే 46 అంశాలపై స్వతంత్ర నిర్ణయాధికారాలను కల్పిస్తుంది.