
తూర్పు గోదావరి కల్తీ పాల విషాదంలో13కు చేరిన మృతుల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ చేసినట్లు అనుమానిస్తున్న పాలు తాగిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రస్తుతం ఏడుగురు వ్యక్తులు రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు అని ఆరోగ్య శాఖ అధికారులు గురువారం తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఫిబ్రవరి 22న మొదట గుర్తింపు
ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, ఈ ఘటన ఫిబ్రవరి 22న మొదటగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజున లాలచేరు ప్రాంతంలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు వృద్ధులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రులకు చేరారు. వారికి మూత్రం నిలిచిపోవడం (అనూరియా), వాంతులు, కడుపు నొప్పి, మూత్రపిండాల పనితీరు తీవ్రంగా దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించాయి. కొందరి పరిస్థితి విషమించడంతో డయాలసిస్ చికిత్స కూడా చేయాల్సి వచ్చింది.
బాధితులందరూ ఒకే ప్రాంతానికి చెందినవారే కావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో కల్తీ చేసిన పాలు తాగడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు బలమైన ఆధారాలు లభించాయి. బాధితుల రక్త పరీక్షల్లో బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇది విషపూరిత పదార్థాలు శరీరంలోకి వెళ్లిన సంకేతంగా వైద్యులు భావిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పాలను కొరుకొండ మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి మిల్క్ డెయిరీ ద్వారా సరఫరా చేసినట్లు తేలింది. ఈ డెయిరీ నుంచి సుమారు 106 కుటుంబాలకు పాలు పంపిణీ చేసినట్లు సమాచారం సేకరించారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతాల్లో పాల సరఫరాను అధికారులు నిలిపివేశారు.
ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. అక్కడ వైద్యులు, నర్సులు, అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంచారు. బాధితులను వెంటనే ఆస్పత్రులకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనను సమగ్రంగా పరిశీలించేందుకు జిల్లా పరిపాలన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేసింది. ఇందులో జిల్లా సర్వైలెన్స్ అధికారి, వైద్యులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు పాల్గొంటున్నారు. ఈ బృందం ఘటనకు అసలు కారణాలను గుర్తించేందుకు పరిశోధనలు కొనసాగిస్తోంది.
ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది. సంబంధిత డెయిరీ యూనిట్‌ను అధికారులు తనిఖీ చేసి పాలు, పనీర్, నెయ్యి, తాగునీరు, వెనిగర్ నమూనాలు సేకరించారు. ఈ నమూనాలను కాకినాడలోని జేఎన్‌టీయూ ప్రయోగశాలతో పాటు హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌కు పంపించారు. అక్కడ మైక్రోబయాలజికల్, రసాయన, విషపూరిత కల్తీ పదార్థాల విశ్లేషణ జరగనుంది. అదే సమయంలో బాధితుల రక్తం, మూత్ర నమూనాలను కూడా టాక్సికాలజీ పరీక్షల కోసం పంపించారు.
క్లూస్ టీం తో పాటు, ఫోరెన్సిక్ బృందాలు ఘటన స్థలాన్ని పరిశీలించాయి. మరణించిన వారి పోస్ట్‌మార్టం నమూనాలను విజయవాడలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పాల సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించి, మరెవరికైనా ఈ పాలు అందాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ కూడా ప్రత్యేకంగా స్పందించింది. నలుగురు వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం 41 పాల నమూనాలు, పశువుల మేత, నీటి నమూనాలను సేకరించింది. వీటిని విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న నరసాపురం గ్రామానికి చెందిన అద్దాల గణేశ్వరరావు(33)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల సరఫరాకు సంబంధించిన డెయిరీ యూనిట్‌ను అధికారులు సీజ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194, సిఆర్పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్తీకి ఉపయోగించిన పదార్థాలు ఏమిటి? అవి పాలలో ఎలా కలిశాయి? ఇంకా ఎన్ని కుటుంబాలు ప్రభావితమయ్యాయి? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టుతున్నారు.
