Let's talk: editor@tmv.in
తూర్పు గోదావరిలో భద్రతా తనిఖీలు: ఐదు అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులు సీజ్

తూర్పు గోదావరిలో భద్రతా తనిఖీలు: ఐదు అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులు సీజ్

Panthagani Anusha
11 ఏప్రిల్, 2026

ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసి నిబంధనలకు విరుద్ధంగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఉప రవాణా కమిషనర్ (ఆర్టీసీ) ఆర్‌.సురేష్‌ ఆదేశాల మేరకు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందం బుధ, గురువారాల్లో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ డ్రైవ్‌లో భాగంగా భద్రతా లోపాలున్న ఐదు అంతర్రాష్ట్ర స్లీపర్ కోచ్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.

హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు నడిచే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సుల తీరును పరిశీలించేందుకు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాభార్జనే ధ్యేయంగా యజమానులు నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో అదనపు డీజిల్ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఈ అదనపు ట్యాంకులు పెను ముప్పుగా మారుతాయని ఇది నిబంధనల ప్రకారం తీవ్రమైన ఉల్లంఘన అని అధికారులు స్పష్టం చేశారు.

మరికొన్ని బస్సుల్లో అత్యవసర ద్వారాల వద్ద ప్రయాణికుల లగేజీని నింపడం పై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చే మార్గాలను అడ్డుకోవడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా కొన్ని బస్సుల్లో వెనుక వైపు ఎమర్జెన్సీ డోర్లు లేకపోవడం, ఎస్కేప్ హాచ్‌లు పని చేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ఈ ఉల్లంఘనల కారణంగా ఆయా బస్సులను వెంటనే సీజ్ చేసి రాజమహేంద్రవరం ప్రాంతీయ రవాణా కార్యాలయానికి తరలించారు.

ఇక నిబంధనలు ఉల్లంఘించిన బస్సు యజమానులకు రవాణా శాఖ అధికారులు భారీ జరిమానాలు విధించారు. పన్నులు మరియు పెనాల్టీల రూపంలో మొత్తం రూ. 2.1 లక్షలు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, నిబంధనలు పాటించని ట్రావెల్స్‌పై భవిష్యత్తులోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆర్‌.సురేష్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.