Let's talk: editor@tmv.in
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం:వధువు సోదరుల చేతిలో వరుడు బలి

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం:వధువు సోదరుల చేతిలో వరుడు బలి

Panthagani Anusha
28 ఫిబ్రవరి, 2026

అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకుంది కానీ ఆ సంతోషం కొన్ని గంటలైనా నిలవలేదు. తమ స్థాయికి తగని వాడిని పెళ్లి చేసుకుందన్న కక్షతో వధువు సోదరులు మృగాల్లా మారారు. చెల్లెలి కళ్లముందే నూతన వరుడిని రాళ్లతో కొట్టి కిరాతకంగా హతమార్చారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో చోటుచేసుకున్న ఈ ‘పరువు హత్య’ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. దివ్య వెల్లడించిన వివరాల ప్రకారం పోలిపల్లి సూర్యప్రకాశ్‌ (41), సంధ్య (40)లకు పాఠశాల రోజుల నుంచే పరిచయం ఉంది. సూర్యప్రకాశ్ తన తండ్రి నిర్వహించే వస్త్ర దుకాణంలో సహాయం చేస్తుండగా, సంధ్య మండల రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న పాత పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి పెద్దల అంగీకారం లేకపోవడంతో గురువారం నాడు కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన అనంతరం సంధ్య తన పెళ్లి ఫోటోలను సోదరులకు పంపింది.

కాగా వివాహం ముగించుకున్న నూతన వధూవరులు గురువారం రాత్రి ద్వారపూడిలోని సూర్యప్రకాశ్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటంతో వారిద్దరూ బయటే వేచి చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న సంధ్య సోదరులు, ఒక్కసారిగా సూర్యప్రకాశ్‌పై దాడికి దిగారు. కళ్లముందే రాళ్లతో విచక్షణారహితంగా తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై సూర్యప్రకాశ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. చెల్లెలు ప్రభుత్వ ఉద్యోగిని కావడం, వరుడు సాధారణ వ్యాపారి కావడంతో పాటు ఆదాయ వ్యత్యాసాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని పరువు హత్య కోణంలో దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు. పెళ్లైన రోజే వరుడు హత్యకు గురవ్వడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.