Let's talk: editor@tmv.in
తుళ్లూరులో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించిన హోం మంత్రి అనిత

తుళ్లూరులో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించిన హోం మంత్రి అనిత

Dantu Vijaya Lakshmi Prasanna
5 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలోని తుళ్లూరులో కొత్తగా నిర్మించిన ఉప పోలీసు సూపరింటెండెంట్ (డీఎస్పీ) కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా కూడా పాల్గొన్నారు. ఈ కొత్త సదుపాయం రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో శాంతిభద్రతల నిర్వహణను మెరుగుపరుస్తుందని భావిస్తున్నాను అంటూ అనిత తన ఎక్స్ కతాలో పోస్ట్ చేశారు.

కార్యాలయం ప్రారంభం

నవంబర్ 4 మంగళవారం ఉదయం పండితులచే వేద క్రతువులు, సాంప్రదాయక ప్రతిష్ఠాపనతో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత నివాసితులు పాల్గొన్నారు.

ఈ కార్యాలయం ఏర్పాటుకు ముందు, తుళ్లూరు మండలం గుంటూరు గ్రామీణ పోలీసు జిల్లాలోని మంగళగిరి డీఎస్పీ కార్యాలయం పరిధిలో ఉండేది. తుళ్లూరు డీఎస్పీ కార్యాలయం ప్రారంభంతో, రాష్ట్రంలోని ముఖ్య సంస్థలు ఉన్న అమరావతి ప్రాంతంలో మరింత దృష్టి సారించడానికి ఒక కొత్త పోలీసు సబ్-డివిజన్ అధికారికంగా ఏర్పాటుచేశారు.

వ్యూహాత్మక స్థానం

ఈ కార్యాలయం ప్రధాన ప్రభుత్వ సంస్థలకు సమీపంలో ఉంది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇక్కడి నుంచి సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే నెక్కల్లు (నెల్లపాడు) లోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ప్రాంతం నుంచి దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజధాని ప్రాంతంలో భద్రత, ట్రాఫిక్ సమన్వయం మరియు ప్రజల రక్షణను నిర్వహించడానికి ఈ ప్రదేశం వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా ప్రభుత్వం భావించింది.

తుళ్లూరు డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి జోన్‌లో పోలీసు స్టేషన్ల మధ్య సమర్థవంతమైన సమన్వయానికి అత్యవసర ప్రతిస్పందనను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్య రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలలో పరిపాలనా, భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్రం చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది.

సంస్థాగత నిర్మాణం

ప్రస్తుత సంస్థాగత నిర్మాణo ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 115 డీఎస్పీ కార్యాలయాలు 26 పోలీసు జిల్లాలు మరియు 13 పోలీసు రేంజుల కింద పనిచేస్తున్నాయి. ప్రతి సబ్-డివిజన్‌కు ఒక ఉప పోలీసు సూపరింటెండెంట్ లేదా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షిస్తారు మరియు వారు సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు రిపోర్ట్ చేస్తారు. తుళ్లూరు డీఎస్పీ కార్యాలయం ప్రారంభం, పరిపాలనా కార్యకలాపాలు, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్న అమరావతి ప్రాంతంలో పోలీసు పరిపాలనను వికేంద్రీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగు.