Let's talk: editor@tmv.in
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరించండి: సీఎం రేవంత్‌రెడ్డి

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరించండి: సీఎం రేవంత్‌రెడ్డి

Panthagani Anusha
31 అక్టోబర్, 2025

మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు తీవ్ర వాతావరణ ప్రభావానికి గురవుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యంత ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవాలని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రైతులు కష్టపడి పండించిన పంట నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

మండల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండలస్థాయి అధికారిని ప్రత్యేక ఇన్‌ఛార్జిగా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్షణ చర్యల కోసం అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సెలవులు రద్దు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజు 24 గంటల వ్యవధిలో పరిస్థితులపై కలెక్టర్లకు నివేదికలు ఇవ్వడం తప్పనిసరి చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ధాన్యం సేకరణపై తీసుకుంటున్న చర్యలను మంత్రి వర్గం, కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కాగా ఈ కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎంఓ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పంటల కోతల కాలంలో వచ్చిన ఈ తుఫాను రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా, స్థాయి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే ధాన్యాన్ని సమీప ఫంక్షన్ హాళ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సంప్రదించి సూచనలు అందించాలన్నారు. అదేవిధంగా ప్రభావిత జిల్లాల్లో కలెక్టర్–ఎస్పీలు సంయుక్తంగా మానిటరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, జిల్లా ఇన్‌ఛార్జి ప్రజల మధ్య పర్యటిస్తూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి వివరించారు.

వరద సహాయం–రక్షణ చర్యలు బలోపేతం

తుఫాను తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్‌, హనుమకొండల్లో వరద సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు అదనపు పడవలను పంపించడంతో పాటు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే తరలించాలని సూచించారు. తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన పరికరాలను వినియోగించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అవసరమైన చోట డ్రోన్ల సహాయంతో ఆహారం, త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రోడ్ల పరిస్థితిపై పర్యవేక్షణ

వరదల ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్‌ను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని, చెరువులు, వాగులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, లోలెవల్‌ బ్రిడ్జిల వద్ద స్థానికులను అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వరంగల్‌ పర్యటన వాయిదా పడగా, గురువారం వరంగల్‌, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలకు సిద్ధంగా ఉందని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరించండి: సీఎం రేవంత్‌రెడ్డి - Tholi Paluku