
తుఫాను తీవ్రత మధ్య పత్తి కొనుగోలు
ప్రస్తుతం నెలకొన్న మొంథా తుఫాను తీవ్రత నేపధ్యంలో, రైతుల శ్రేయస్సు దృష్ట్యా పత్తి కొనుగోలు కేంద్రాలు ఈనెల 29 బుధవారం అనగా రేపటి నుండి ప్రారంభించి, రైతుల వద్ద నుండి ప్రత్తి కొనుగోలు చేయవలసినదిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు..
రాష్ట్రంలో ఈ ఏడాది 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్తికి క్వింటాలుకు రూ. 8,110/-లు కనీస మద్దతు ధర అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా 30 ప్రత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమలో ప్రస్తుతం కొనుగోలు చేస్తూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తుపాను తగ్గిన తదనంతరం కొనుగోలు చేయడం జరుగుతుంది..
పత్తి పంటను అమ్మదలచిన రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (విఏఏ) ద్వారా నమోదు చేసుకున్న తరువాత, "కపాస్ కిసాన్” యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా అమ్ముకోదలచిన రోజు స్లాట్ బుక్ చేసుకొని, స్లాట్ ప్రకారం సిసిఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి యాప్ లో సూచించబడిన కొనుగోలు కేంద్రాల ద్వారా (వాటి పరిదిలోకి వచ్చే జిన్నింగ్ మిల్లుల ద్వారా) అమ్ముకోవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇందుకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు రైతులకు పూర్తిగా సహకరించే విధంగా వ్యవసాయశాఖ జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించడమైంది. అంతే కాకుండా జిల్లా వ్యవసాయ మరియు మార్కెటింగ్ అధికారులు తగు సూచనలను దిగువ స్థాయి సిబ్బందికి ఇస్తూ, పర్యవేక్షించి ప్రత్తి కొనుగోలు విజయవంతంగా పూర్తి చేయవలసినదిగా వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం వారు ఆ ప్రకటనలో తెలియజేశారు.
