
తుని రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం
స్థానిక రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ భవనం పైకప్పు (టెర్రస్) మీద ఉంచిన పాత నేమ్ బోర్డుల గుట్ట నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ పరిసరాల్లో కాసేపు కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అత్యవసర విభాగం, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ ఈ ఘటనపై స్పందిస్తూ స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా తొలగించిన పాత బోర్డులను టెర్రస్‌పై ఒక పక్కన భద్రపరిచినట్లు తెలిపారు. వాటికి నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయని అయితే ఫైర్ టెండర్లు వెంటనే అలర్ట్ కావడంతో మంటలు తక్షణమే ఆర్పడం జరిగిందని వివరించారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అదేవిధంగా రైల్వే ఆస్తికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆయన స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అతడిని అదుపులోకి తీసుకుంది. మానసిక సమస్యలతో ఉన్నట్లు భావిస్తున్న సదరు వ్యక్తిని ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. తుని స్టేషన్ గుండా వెళ్లే రైలు సర్వీసులు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నడుస్తున్నాయని ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
