Let's talk: editor@tmv.in
తుని అత్యాచార ఘటనలో నిందితుడు మృతి

తుని అత్యాచార ఘటనలో నిందితుడు మృతి

Dantu Vijaya Lakshmi Prasanna
24 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, తునిలో నారాయణరావు అనే 62 ఏళ్ల వ్యక్తి పోలీసు కస్టడీలో ఉండగా మరణించిన ఘటన అందరినీ ఈ విషయం చర్చించుకునేలా చేసింది. ఈ కేసుకు సంభందించిన వివరాలు ఇలా వున్నాయి. కాకినాడ జిల్లా తుని లో నారాయణరావు అనే వ్యక్తి తన పొరుగున ఉన్న 13 ఏళ్ల ప్రభుత్వ గురుకుల పాఠశాల బాలికను ఆమె హాస్టల్ నుండి లోబరుచుకుని, ఒక తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తోట యజమాని నారాయణరావును నిలదీసి, వారిద్దరూ పారిపోతున్న దృశ్యాన్ని వీడియో తీయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు నారాయణరావును అరెస్టు చేశారు.

నారాయణరావును బుధవారం, అక్టోబర్ 22, 2025 న పోలీసులు అరెస్టు చేసి, కింది సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) లో సెక్షన్లు 2, 4 ( మైనర్‌లపై లైంగిక దాడికి సంబంధించిన ప్రాథమిక సెక్షన్లు). బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 63 ప్రకారం తీవ్రమైన లైంగిక దాడి, కిడ్నాప్ ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లు. 13 ఏళ్ల అమ్మాయి నారాయణరావుతో వెళ్లడానికి సమ్మతించినప్పటికీ, "మైనర్ల సమ్మతి, సమ్మతి కాదు" అనే ముఖ్యమైన చట్టపరమైన అంశాన్ని పోలీసులు నొక్కి చెప్పారు. అందుకే అతనిపై తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు.

పోలీసు కస్టడీలో మరణం

పోలీసుల కథనం ప్రకారం, ఈ సంఘటన బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తుని పట్టణ శివార్లలోని కోమటి చెరువు వద్ద జరిగింది. నిందితుడు, తటిక నారాయణ రావుగా గుర్తించబడ్డాడు. "పోలీసులు అతన్ని స్థానిక మేజిస్ట్రేట్ వద్దకు హాజరుపరచడానికి ఎస్కార్ట్ చేస్తుండగా, అతను మల విసర్జన చేసుకోవడానికి ఆపమని అడిగాడు. జీపు ఆపగానే, అతను అకస్మాత్తుగా చెరువులోకి దూకేశాడు. ఇది ఆత్మహత్య కేసుగా అనుమానిస్తున్నాము," అని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. మరుసటి రోజు ఉదయం, గురువారం, అక్టోబర్ 23 న, చెరువులో నుంచి నారాయణరావు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు అతని మరణాన్ని ధృవీకరించారు.

అయితే మైనర్‌పై లైంగిక నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆ దృశ్యాలు వైరల్ వీడియోగా మారిన వ్యక్తి, పోలీసుల అదుపులో ఉండగా ఆత్మహత్య చేసుకుని మరణించిన సంఘటనను మహిళా కమిషన్ సుమోటోగా (స్వతహాగా) కేసును స్వీకరించింది.

మహిళా కమిషన్ స్పందన

ఇదిలా ఉండగా, మైనర్ గురుకుల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా (స్వతహాగా) కేసును స్వీకరించింది.

ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ శైలజ కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో మాట్లాడారు. నిందితుడిని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) కింద విచారించాలని ఆదేశించారు. ఈలోపే నిందితిడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలికి తక్షణమే రక్షణ, వైద్య సహాయం, న్యాయ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు బాలల సంక్షేమ కమిటీకి కూడా ఆదేశాలు జారీ చేయబడ్డాయి.కమిషన్ జిల్లా పోలీస్ శాఖ నుండి 48 గంటల్లోగా వివరణాత్మక నివేదికను కోరింది . గురుకుల పాఠశాలల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ని ఆదేశించింది.న్యాయం ఆలస్యం కాకుండా అందించబడుతుందని నిర్ధారించుకోవడానికి దర్యాప్తును కమిషన్ నిశితంగా పర్యవేక్షిస్తుందని డాక్టర్ శైలజ పేర్కొన్నారు.

తుని అత్యాచార ఘటనలో నిందితుడు మృతి - Tholi Paluku