Let's talk: editor@tmv.in
తుది అంకానికి నక్సలిజం

తుది అంకానికి నక్సలిజం

Pinjari Chand
30 మార్చి, 2026

దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలిజం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని కేంద్ర భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. కఠిన భద్రతా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస పథకాలు సమన్వయంతో అమలు కావడంతో మావోయిస్టు ఉద్యమం గణనీయంగా బలహీనపడింది. ఒకప్పుడు దేశ భద్రతకు అతిపెద్ద సవాలుగా నిలిచిన ఈ ఉద్యమం ప్రస్తుతం కొద్దిమంది అరణ్య ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతోంది.

రేపటితో ముగియనున్న ఆపరేషన్‌ కగార్ గడువు

‘ఆపరేషన్‌ కగార్’ గడువు రేపటితో ముగియనుంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 మార్చి 31ను డెడ్‌లైన్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆ దిశగా ప్రయత్నిస్తూ దేశంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయేలా చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పటికే అనేక మంది టాప్‌ మావోయిస్టు నాయకులు పోలీసుల ముందు చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో తమ,తమ ఆయుధాలను వదిలి సరెండర్‌‌ అయ్యారు. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలిజానికి కట్టడి పడుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భద్రతా బలగాల కఠిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస పథకాలు సమన్వయంతో అమలు కావడంతో గత పదేళ్లలో 10 వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.

పెరుగుతున్న లొంగుబాట్లు

అధికారిక గణాంకాల ప్రకారం 2025లోనే 2,300 మంది మావోయిస్టులు లొంగిపోగా, 2026 తొలి మూడు నెలల్లోనే 630 మందికి పైగా ప్రధాన ప్రవాహంలోకి చేరారు. బస్తర్ ప్రాంతంలో అగ్రశ్రేణి నేతల లొంగుబాట్లు, భద్రతా దళాల ఆపరేషన్లతో నక్సలిజానికి గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొన్నారు.

రోడ్లు, మౌలిక వసతులతో మార్పు

ఒకప్పుడు ‘రెడ్ కారిడార్’గా పిలిచే మావోయిస్టు ప్రభావ ప్రాంతం బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. ‘పశుపతి నుంచి తిరుపతి వరకు’ వ్యాపించిన ఈ ప్రభావం ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు 100కి పైగా జిల్లాల్లో ప్రభావం ఉండగా, ఇప్పుడు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అరణ్యాలు, ఒడిశా సరిహద్దులు, మహారాష్ట్రలో గడ్చిరోలి, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బస్తర్ ప్రాంతంలో ఎక్కువ భాగం నక్సల్ రహితంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టారు. గత 10 ఏళ్లలో 12,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించగా, మొత్తం 15,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు అభివృద్ధి చేశారు. కీలక ప్రాంతాల్లో వంతెనలు, రైల్వే మార్గాలు నిర్మించడంతో పాటు, 9,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు.

భద్రతా వ్యవస్థ బలోపేతం

2014లో 66 మాత్రమే ఉన్న పోలీస్ స్టేషన్లు ఇప్పుడు 586కు పెరిగాయి. గత ఆరు సంవత్సరాల్లో 361 కొత్త భద్రతా శిబిరాలు, 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా నక్సల్ ఘటనలు నమోదయ్యే పోలీస్ స్టేషన్ల సంఖ్య 2013లో 330 ఉండగా, 2025 నాటికి 52కు తగ్గింది.

అభివృద్ధి పథకాల ప్రభావం

ప్రభుత్వ పథకాల అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల మంజూరు భారీగా పెరిగింది. ఆయుష్మాన్ కార్డులు, ఆధార్ నమోదు కూడా పెరిగింది. 250కి పైగా ఏకలవ్య పాఠశాలలు, ఐటీఐలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

పునరావాసంతో ప్రధాన ప్రవాహంలోకి

లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం, గృహ వసతి, ఉద్యోగ శిక్షణ వంటి సదుపాయాలు అందించే ప్రత్యేక పథకాలు అమల్లో ఉన్నాయి. దీంతో యువత నక్సల్ దారిని వదిలి సాధారణ జీవితానికి చేరుకుంటున్నారు.

మిగిలిన మావోయిస్టుల సంఖ్య

అధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో సుమారు 500 నుంచి 600 మంది యాక్టివ్ మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆయుధాలతో పనిచేసే ప్రధాన దళం కూడా కొన్ని వందలకే పరిమితమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో ఉన్న మావోయిస్టు బలగం ఇప్పుడు వందల్లోకి క్షీణించడం ఉద్యమం బలహీనతకు నిదర్శనంగా భావిస్తున్నారు.

నాయకత్వానికి గట్టి దెబ్బ

ఇటీవలి సంవత్సరాల్లో టాప్ మావోయిస్టు నాయకత్వానికి వరుస దెబ్బలు తగిలాయి. ప్రముఖ నాయకుడు నంబాల కేశవరావు (బసవరాజు) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మడవి హిడ్మా ఎన్‌కౌంటర్‌‌లో మరణించాడు. మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ లక్ష్మణరావు (గణపతి) ప్రస్తుతానికి కనిపించకుండా పోయినట్లు సమాచారం. మిసిర్ బేస్రా వంటి కొందరు కీలక నాయకులు ఇంకా అడవుల్లో ఉన్నప్పటికీ, వారి కార్యకలాపాలు పరిమితమయ్యాయి. బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావు వంటి నాయకుల లొంగుబాటు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లలో కేంద్ర కమిటీ స్థాయి నాయకుల్లో సగానికి పైగా హతమవ్వడం, అరెస్ట్ కావడం, లేకుంటే లొంగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నక్సల్స్‌కు అందే నిధుల సరఫరాను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కేంద్ర సంస్థలు, రాష్ట్ర యంత్రాంగం కలిసి కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.

ముగింపు దశలో ఉద్యమం

ప్రస్తుతం అడవుల్లో కొద్దిమంది కీలక నాయకులు మాత్రమే మిగిలి ఉండగా, వారి సామర్థ్యం కూడా పరిమితమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. బలగం, నిధులు, ప్రజా మద్దతు తగ్గిపోవడంతో ఉద్యమం చివరి దశలోకి చేరిందని భావిస్తున్నారు.

నక్సలిజం నిర్మూలనపై లోక్‌సభలో చర్చ నేడు

దేశాన్ని వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) నుంచి పూర్తిగా విముక్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై లోక్‌సభలో సోమవారం చర్చ జరగనుంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు ఈ చర్చ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ సచివాలయం ఈ అంశాన్ని రూల్ 193 కింద చర్చకు పెట్టింది. ఈ నిబంధన ప్రకారం చర్చ అనంతరం ఓటింగ్ ఉండదు, కానీ ప్రభుత్వ స్పందన తప్పనిసరి. ఈ చర్చను టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించనుండగా, శివసేన సభ్యుడు శ్రీకాంత్‌ షిండే కూడా పాల్గొననున్నారు. నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.

తాజా సమీక్ష ప్రకారం నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 8 నుంచి 7కు తగ్గింది. జార్ఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని మొత్తం 38 జిల్లాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించింది. ‘నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ టు అడ్రెస్ ఎల్‌డబ్ల్యూఈ’పై ఇటీవల పునఃసమీక్ష చేపట్టిన కేంద్రం, ఒకేసారి భద్రతా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. మిగిలిన మావోయిస్టు దళాలను పూర్తిగా నిర్మూలించేందుకు భద్రతా బలగాలు మెగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.

ఇక ముందుకు చర్యల భాగంగా, కొంతమంది కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సీఏపీఎఫ్) బెటాలియన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని, అలాగే పలు సంక్షేమ పథకాలను ప్రకటించే దిశగా కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

2004 నుంచి ఈ ఏడాది మార్చి 26 వరకు మొత్తం 16,496 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాదిలోనే అత్యధికంగా 2,337 మంది ఆయుధాలు వదిలి ప్రధాన ప్రవాహంలోకి చేరడం గమనార్హం. మొత్తంగా, నక్సలిజంపై చివరి దశలో ఉన్న పోరాటంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై లోక్‌సభలో జరిగే ఈ చర్చ కీలకంగా మారనుంది.