Let's talk: editor@tmv.in
తీర ప్రాంత రాష్ట్రాలు సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్నాయి: స్పీకర్ ఓం బిర్లా

తీర ప్రాంత రాష్ట్రాలు సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్నాయి: స్పీకర్ ఓం బిర్లా

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

తీర ప్రాంత రాష్ట్రాలు ఎదురయ్యే సహజ సవాళ్లను అభివృద్ధి అవకాశాలుగా మార్చుకున్నాయని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఉత్తమ ఉదాహరణగా నిలిచారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. గోవాలో నిర్వహించిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ జోన్-VII సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడంలో శాసనసభలు కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా యువ ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలు తీర ప్రాంత రాష్ట్రాలుగా ఉండటంతో సహజ విపత్తులు, పొడవైన తీరరేఖలు, తెగల ప్రాంతాలు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బిర్లా అన్నారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ పారిశ్రామికీకరణ, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సవాళ్లను అభివృద్ధి అవకాశాలుగా మార్చారని తెలిపారు. నర్మదా నదీ జలాలను పొడిబారిన ప్రాంతాలకు తీసుకువచ్చి నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, ప్రపంచ మార్పులకు అనుగుణంగా కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు.

ఇతర తీర రాష్ట్రాలు కూడా సహజ విపత్తులు, సంక్షోభాలను ఎదుర్కొంటూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగాయని బిర్లా చెప్పారు. ఈ రాష్ట్రాల శాసనసభలు సంక్షోభాల సమయంలో అవసరమైన చట్టాలు, విధానాలు తీసుకువచ్చి అభివృద్ధిని కొనసాగించాయని పేర్కొన్నారు. ప్రజలకు తమ ప్రజాప్రతినిధులపై అధిక ఆశలు ఉన్నాయని ఆయన అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలు తీర ప్రాంత అభివృద్ధి విషయంలో పరస్పరం ఉత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. రాష్ట్ర శాసనసభల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఏఐ యుగంలోనూ మానవీయ విలువలు ముఖ్యం

ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఉత్తమ పాలనా విధానంగా గుర్తిస్తున్నారని బిర్లా తెలిపారు. 1952 నుంచి ప్రతి ఎన్నికలో ఓటింగ్ శాతం పెరుగుతుండటం భారత ప్రజాస్వామ్య విజయాన్ని సూచిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికతల యుగం నడుస్తున్నప్పటికీ మానవీయ విలువలు కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. శాసనసభల్లో చట్టాలు, విధానాలపై ఉత్తమ చర్చలు చేసే ప్రజాప్రతినిధులే తమ రాష్ట్రాల్లో ప్రముఖ నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. శాసనసభ నియమాలు, విధానాలను ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా చర్చల్లో పాల్గొని నిర్మాణాత్మక సంభాషణకు దోహదపడతారని అన్నారు.

దేశ జీడీపీకి అత్యధికంగా సహకరిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా కూడా ఉన్నాయని బిర్లా పేర్కొన్నారు. ఈ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌సావంత్‌, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌, గోవా అసెంబ్లీ స్పీకర్ గణేశ్‌గోవాంకర్‌‌, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్‌ నర్వేకర్‌‌ తదితరులు పాల్గొన్నారు.