
తీర ప్రాంత అడవుల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడమే లక్ష్యంగా, రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనవరి నెలాఖరులోపు ఈ రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సంబంధించిన స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్‌లోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ దిశగా కీలక మార్గనిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తీర ప్రాంతానికి పచ్చని రక్షణ కవచం
భారతదేశంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, సుమారు 974 కిలోమీటర్ల పొడవైన తీరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తీర ప్రాంతం మొత్తం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనం విస్తరించాలనే లక్ష్యంతో మడ (మ్యాంగ్రోవ్), సరుగుడు, తాటి వంటి తీరానికి అనుకూలమైన మొక్కలను నాటాలని సూచించారు. ఇవి తుపానులు, అలల ఉద్ధృతి వంటి విపత్తుల నుంచి తీర ప్రాంత నివాసాలను కాపాడటంలో కీలకంగా నిలుస్తాయని వివరించారు.
ఇప్పటికే కోస్తా తీరం వెంబడి 402 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి సంరక్షణ చేపడుతోందని గుర్తు చేశారు. మిగిలిన భూముల్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూ విస్తీర్ణం, అందులో అటవీ శాఖకు చెందిన భూమి ఎంత, ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల చేతిలో ఉన్న భూమి ఎంత అన్న అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.
మూడు దశల్లో గ్రేట్ గ్రీన్ వాల్
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొదటి దశలో తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతం మొత్తం మొక్కలతో నింపాలి.
రెండో దశలో తీర ప్రాంతానికి అనుసంధానమైన కాలువలు, రహదారులు, డొంకల వెంబడి విస్తృతంగా వృక్షారోపణ చేపట్టాలి. మూడో దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు ఆదాయం పెరిగే విధంగా, పంటలకు అనుకూలంగా ఉండే చెట్లు పెంచేలా ప్రణాళికలు రూపొందించాలి.
ఈ కార్యక్రమాలకు మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్‌లైన్ హ్యాబిటాట్స్ అండ్ ట్యాంజిబుల్ ఇన్‌కమ్స్, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ గ్రీన్ క్లైమేట్ ఫండ్, సిఎస్ఆర్ నిధులు, అలాగే ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. స్థానిక సమాజాలను భాగస్వాములుగా మార్చి, ఇప్పటికే ఉన్న మొక్కలను కాపాడటం, తీర ప్రాంతాల్లో ఆక్రమణలను అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.
50 శాతం గ్రీన్ కవర్ - ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక లక్ష్యం
రాష్ట్రాన్ని 50 శాతం గ్రీన్ కవర్తో నింపడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యక్తిగతంగా అప్పగించిన ప్రతిష్టాత్మక లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ బాధ్యత తనతో పాటు అన్ని శాఖలపైనా ఉందని స్పష్టం చేశారు. గ్రీన్ వాల్ కార్యక్రమం సక్రమంగా అమలైతే గ్రీన్ కవర్ స్వయంగా పెరుగుతుందని అన్నారు.
జిల్లాల వారీగా అన్ని సంబంధిత శాఖలను భాగస్వాములుగా చేసుకుని, మొక్కలు నాటేందుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అటవీ శాఖతో పాటు ఉద్యానశాఖ, నీటిపారుదల, గిరిజన సంక్షేమం, హెచ్‌ఆర్‌డీ, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
వారం వారం పురోగతి, కచ్చితమైన ఫలితాలు
గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ కార్యక్రమాల్లో లక్ష్యాలకు అనుగుణంగా వారం వారం పురోగతి కనబడాలని, పనుల్లో ఎక్కడా అలసత్వానికి తావు లేదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధం, పచ్చదనం పెంపుదల అన్నీ కలిపి మూడు అంశాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్షా సమావేశంతో ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణకు కొత్త ఊపొచ్చిందని, తీర ప్రాంతానికి పచ్చని రక్షణ కవచం ఏర్పడే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది.
