
తిరువనంతపురంలో విజయంపై బీజేపీకి శశిథరూర్ అభినందన
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ శనివారం హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో బీజేపీ సాధించిన చారిత్రక విజయానికి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిని ‘ప్రజాస్వామ్య సౌందర్యం’గా ఆయన అభివర్ణించారు. ఎక్స్ వేదికగా స్పందించిన థరూర్, రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్‌కు వచ్చిన తీర్పునైనా, తన నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన ప్రజాభిమానాన్నైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.
‘కేరళ స్థానిక స్వపరిపాలనా ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రజల తీర్పు స్పష్టంగా వెలువడింది. రాష్ట్రంలోని ప్రజాస్వామ్య ఆత్మ మరింత ప్రకాశిస్తోంది. వివిధ స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధించిన యూడీఎఫ్ కు హృదయపూర్వక అభినందనలు. ఇది 2020తో పోలిస్తే ఎంతో మెరుగైన ఫలితం. కఠిన శ్రమ, స్పష్టమైన సందేశం, పాలకులపై వ్యతిరేకత ఫలితాన్నిచ్చాయి’ అని థరూర్ పేర్కొన్నారు.
తిరువనంతపురం నగర పాలక సంస్థలో బీజేపీ చారిత్రక ప్రదర్శన కనబరిచిందని గుర్తు చేసిన ఆయన నగర రాజకీయాల్లో కీలక మార్పుకు ఇది సంకేతం. బీజేపీకి వినమ్ర అభినందనలు తెలియజేశారు.
అదే ప్రజాస్వామ్యంలోని అసలైన సౌందర్యం. రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్‌కైనా, నా నియోజకవర్గంలో బీజేపీకైనా వచ్చిన ప్రజల తీర్పును గౌరవించాల్సిందే. ప్రజల సంక్షేమం, మంచి పాలన కోసం మా పోరాటం కొనసాగుతుంది అని ఆయన తెలిపారు. తిరువనంతపురం నగర పాలక సంస్థలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించి, సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో 45 ఏళ్లుగా కొనసాగిన వామపక్ష పాలనకు తెరపడింది.
45 ఏళ్లుగా కొనసాగుతున్న ఎల్‌డీఎఫ్ పాలనకు మార్పు కావాలనే ఉద్దేశంతో తాను ప్రచారం చేశానని, అయితే ఓటర్లు మార్పు కోరుతూ మరో పార్టీకి అవకాశం ఇచ్చారని థరూర్ వ్యాఖ్యానించారు.
101 వార్డులు ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ 50 వార్డులు గెలుచుకోగా, ఎల్‌డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 స్థానాలు దక్కించుకున్నాయి. రెండు వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు. పూర్తి మెజారిటీకి బీజేపీ ఒక సీటు దూరంలో నిలిచింది.
అదేవిధంగా పాలక్కాడ్ మున్సిపాలిటీని ఎన్డీయే నిలుపుకోగా, త్రిప్పునితుర మున్సిపాలిటీని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నుంచి కైవసం చేసుకుంది.
లోక్‌సభ ఎన్నికల్లో సురేశ్ గోపీ గెలిచిన త్రిశూర్ జిల్లాలోనూ బీజేపీ గణనీయమైన ప్రదర్శన కనబరిచింది. కోడుంగల్లూరు మున్సిపాలిటీలో 46 వార్డుల్లో 18, త్రిశూర్ కార్పొరేషన్‌లో 8, గురువాయూర్, వడక్కంచేరి మున్సిపాలిటీల్లో రెండేసి, కున్నంకుళం మున్సిపాలిటీలో 7, ఇరింజలకూడ మున్సిపాలిటీలో 6, చాళకూడి మున్సిపాలిటీలో ఒక వార్డును బీజేపీ గెలుచుకుంది.
