
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అంబానీ
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఉదయం వేళ జరిగే సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అన్న ప్రసాదం కోసం అత్యాధునిక వంటశాల
స్వామివారి దర్శనం అనంతరం అంబానీ ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కోసం తిరుమలలో అత్యాధునిక వంటశాల నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలలో అన్న సేవ సంప్రదాయాన్ని విస్తరించాలని, ప్రతి భక్తుడికి పౌష్టికాహారం, భక్తితో కూడిన ప్రసాదం అందాలని ఆయన ఆకాంక్షించారు. 'ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు' అనే తిరుమల ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఈ చొరవ ప్రతిబింబిస్తుంది. సాంకేతికతతో రూపొందించబడిన ఈ కొత్త వంటశాలకు రోజుకు 2 లక్షల మందికి పైగా భక్తులకు పోషకాహారంతో కూడిన అన్నప్రసాదాన్ని సిద్ధం చేసి పంపిణీ చేసే సామర్థ్యం ఉండనుంది.
గురువాయూరు ఆలయానికి రూ. 5 కోట్ల విరాళం
తిరుమల పర్యటన సందర్భంగా, అంబానీ దేశంలోని మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి తన మద్దతును కొనసాగిస్తూ, కేరళలోని గురువాయూరు శ్రీ కృష్ణ దేవాలయానికి కూడా 5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. దర్శనం పూర్తయిన అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు ముఖేష్ అంబానీని సత్కరించారు. టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.
