Let's talk: editor@tmv.in
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం: విచారణకు ఏకసభ్య కమిటీ నియామకం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం: విచారణకు ఏకసభ్య కమిటీ నియామకం

Panthagani Anusha
21 ఫిబ్రవరి, 2026

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి సంబంధించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన తుది నివేదికను పరిశీలించేందుకు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలను సిఫార్సు చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌తో ఏకసభ్య కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సిట్ నివేదిక ఆధారంగా చర్యలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే తన విచారణను పూర్తి చేసి గత జనవరి 23న కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు, కమిటీ సభ్యుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఒక ప్రత్యేక నోట్‌ను కూడా అందజేసింది. నెయ్యి టెండర్ల నిబంధనల సడలింపులో జరిగిన లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలపై ఈ కమిటీ లోతుగా విశ్లేషించనుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జారీ చేసిన జీవో ప్రకారం.. 1983 బ్యాచ్‌కు చెందిన దినేష్ కుమార్, అప్పటి అధికారులు తీసుకున్న నిర్ణయాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయా? లేదా అనే కోణంలో విచారణ జరుపుతారు. బాధ్యుల పరిపాలనాపరమైన వైఫల్యాలను గుర్తించి వారిపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వానికి సూచిస్తారు. ఈ కమిటీ తన నివేదికను 45 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుంది.

వివాదానికి నేపథ్యం

గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించారని 2024 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని నాణ్యత లేని పదార్థాలతో పాటు జంతువుల కొవ్వును వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిందని విమర్శించారు.

రాజకీయ దుమారం.. కొత్త ఆరోపణలు

ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. కాగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన ఆరోపణ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వు మాత్రమే కాకుండా బాత్రూమ్ క్లీనింగ్‌కు వాడే రసాయనాలతో కూడా లడ్డూలను కల్తీ చేశారని ఆయన పేర్కొనడం రాజకీయంగా మరింత దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో దినేష్ కుమార్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అప్పటి టీటీడీ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.