
తిరుమల లడ్డూ కథనాలపై స్టే ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ వస్తున్న వార్తలపై స్టే ఇవ్వాలని కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వార్తలను ఆపలేమని, ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2019 జూన్ నుంచి 2023 ఆగస్ట్ వరకు) టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన సుబ్బారెడ్డి, తనపై వస్తున్న ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తక్షణమే ఆ కథనాలను నిలిపివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కోర్టు ఏమన్నదంటే..
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అమిత్ బన్సల్ డిసెంబర్ 23న కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో తప్ప, అవతలి పక్షం వాదనలు వినకుండా మధ్యంతర ఆంక్షలు విధించడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదులకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించడమే న్యాయసమ్మతమని కోర్టు పేర్కొంది.
అయితే ఈ ఆదేశాల తర్వాత కొత్తగా ప్రచురించే కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు కోర్టు పర్యవేక్షణలో ఉంటాయని, ఒకవేళ అవి అభ్యంతరకరంగా ఉంటే చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. మరోవైపు సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ వాదిస్తూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వివాదం నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ల్యాబ్ నివేదికలను ఆధారంగా చూపుతూ తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలు చేయగా, రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఇలాంటి దుష్ప్రచారానికి దిగిందని వైఎస్సార్‌సీపీ కొట్టిపారేసింది.
ఈ నేపథ్యంలోనే వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించగా తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 29, 2026కు వాయిదా వేసింది. అప్పటివరకు ఈ వివాదంపై ఎటువంటి మధ్యంతర స్టే ఉండబోదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
