Let's talk: editor@tmv.in
తిరుమల లడ్డూపై వైకాపాకు మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుమల లడ్డూపై వైకాపాకు మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్

Panthagani Anusha
9 ఫిబ్రవరి, 2026

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపుగా మలిచేందుకు వైకాపా చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ అంశం కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందూ భక్తుల మనోభావాలకు నమ్మకానికి సంబంధించిన అత్యంత సున్నితమైన విషయమని ఆయన స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని సీబీఐ నివేదిక సైతం స్పష్టమైన వాస్తవాలను బయటపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాడిన 60 లక్షల లీటర్ల నెయ్యిలో ఒక్క చుక్క కూడా అసలు నెయ్యి లేదని తేలిపోయిందని ఆయన మండిపడ్డారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు బుకాయిస్తూ ఎదురుదాడికి దిగడం వారి నైతిక పతనానికి నిదర్శనమని మంత్రి ఆరోపించారు.

అయోధ్య లడ్డూల కథతో పాపం తేటతెల్లమైంది

ఇదిలా ఉండగా అయోధ్య రామాలయానికి పంపిన లడ్డూల విషయంలో వైకాపా నాయకులు చెబుతున్న సాకులు వారిని మరింత ఇరకాటంలోకి నెట్టాయని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. అయోధ్యకు పంపిన లడ్డూల కోసం ప్రత్యేక నెయ్యి వాడామని వారే చెబుతున్నారు అంటే తిరుమలలో సాధారణంగా వాడే నెయ్యి కల్తీ అని వారికి ముందే తెలుసు కదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్, పలమనేరులోని సంస్థల నుంచి ప్రత్యేకంగా నెయ్యి తెప్పించి అయోధ్య లడ్డూలు చేశామని చెప్పడం ద్వారా గడిచిన ఐదేళ్లుగా సామాన్య భక్తులకు కల్తీ ప్రసాదాన్ని తినిపిస్తూ మోసం చేశామని వైకాపా నేతలు పరోక్షంగా ఒప్పుకున్నట్లయిందని ఆయన దుయ్యబట్టారు.

వ్యక్తిగత దాడులు మానుకోవాలి

ఈ కుంభకోణం బయటపడటంతో తట్టుకోలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దీనిని సమాజం గమనిస్తోందని మంత్రి హెచ్చరించారు. ఈ వ్యవహారంపై రాజకీయాలకు అతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఇటువంటి అపవిత్ర పనులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అని ప్రతి హిందూ భక్తుడు ఈ విషయంలో ధైర్యంగా గళమెత్తాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.