Let's talk: editor@tmv.in
తిరుమల లడ్డు నాణ్యతను పరీక్షించేందుకు అల్ట్రా మోడర్న్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్: సత్యకుమార్ యాదవ్

తిరుమల లడ్డు నాణ్యతను పరీక్షించేందుకు అల్ట్రా మోడర్న్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్: సత్యకుమార్ యాదవ్

Panthagani Anusha
25 ఫిబ్రవరి, 2026

ఏడుకొండల వాడి ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చారిత్రాత్మక అడుగు వేసింది. గతంలో నెయ్యి నాణ్యతపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా లడ్డు తయారు చేయడానికి ఉపయోగించే ప్రతి పదార్థాన్ని అణువణువూ పరీక్షించేలా రూ. 25 కోట్ల భారీ వ్యయంతో ‘అల్ట్రా మోడర్న్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను సిద్ధం చేస్తోంది.

తిరుమల కొండపై నిర్మిస్తున్న ఈ కొత్త ఆహార పరీక్షా కేంద్రం పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే నెల నుంచే ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ ల్యాబ్ కోసం తిరుమలలోని పాత పిండి మిల్లు ఉన్న చోట, దాదాపు 12 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. అక్కడ ఉన్న రెండంతస్తుల భవనాన్ని అన్ని రకాల వసతులతో ఆధునిక ప్రయోగశాలగా మార్చారు. ఇక్కడ శ్రీవారి ప్రసాదంలో వాడే పదార్థాలను వస్తువులన్నింటిని నిశితంగా పరీక్షిస్తారు.

ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆహార భద్రతా సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూ. 23 కోట్లు ఇచ్చింది. అయితే లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు వివాదాలు రావడంతో తనిఖీలు ఇంకా కఠినంగా ఉండాలని కేంద్రం భావించింది. అందుకే మరిన్ని ఆధునిక యంత్రాల కోసం అదనంగా మరో రూ. 3.5 కోట్లను మంజూరు చేసింది అని మంత్రి పేర్కొన్నారు.

సాధారణంగా మనం వాసన చూసి, రుచి చూసి పదార్థం బాగుందో లేదో చెబుతాం. కానీ ఈ ల్యాబ్‌లో ఏర్పాటు చేస్తున్న 'ఎలక్ట్రానిక్ నాలుక' రుచి నమూనాలను శాస్త్రీయంగా విశ్లేషించి నెయ్యిలో జరిగే అతి సూక్ష్మ స్థాయి కల్తీని సైతం గుర్తిస్తుంది. అదేవీస్తోదంగా 'ఎలక్ట్రానిక్ ముక్కు' సువాసన ప్రొఫైల్స్‌ను అంచనా వేసి నాణ్యతా లోపాలను బయటపెడుతుంది. ఈ అత్యున్నత పరికరాలను ఫ్రాన్స్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇవి మే నెల నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

ఈ ల్యాబ్‌లో కేవలం నెయ్యి మాత్రమే కాకుండా లడ్డూ తయారీలో వాడే డ్రై ఫ్రూట్స్, బియ్యం, పప్పులు వంటి దాదాపు 60 రకాల ముడి పదార్థాలను నిశితంగా పరీక్షిస్తారు. సుమారు 50 రకాల హైటెక్ పరికరాల ద్వారా పురుగుమందుల అవశేషాలు,సూక్ష్మజీవుల ఉనికిని తనిఖీ చేస్తారు. ప్రసాదాలతో పాటు తిరుమలలోని నీరు, ఇతర ఆహార పదార్థాలను కూడా ఇక్కడ తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా 40 మంది నిపుణులైన సిబ్బందిని నియమించనునంట్లు సమాచారం.

ఇదిలా ఉండగా దేశంలోనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంతటి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రసాదాలను అందించడమే కాకుండా తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడటమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే నెలలో ప్రధాన ల్యాబ్ ప్రారంభమైతే ఇకపై శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో భక్తులకు ఎలాంటి అనుమానాలు ఉండబోవని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.