Let's talk: editor@tmv.in
తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి!

తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి!

Panthagani Anusha
11 నవంబర్, 2025

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాని కి సరఫరా చేసే నెయ్యిలో భారీ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ ) దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 2019 నుంచి 2024 మధ్య ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సంస్థ దాదాపు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు, దీని ద్వారా సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం జరిగినట్లు తేలింది.

నకిలీ యూనిట్లు, రసాయనాలతో తయారీ

ఈ కల్తీ రాకెట్‌లో పమ్మీల్ జైన్, విపిన్ జైన్ యాజమాన్యంలోని భోలే బాబా డైరీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ సంస్థ, పాలు, వెన్న కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలు సృష్టించి నెయ్యిని పోలిన పదార్థాన్ని తయారు చేసింది. అదేవిదంగా ఆహార కల్తీలో వాడే మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్స్ వంటి రసాయనాలను ఉపయోగించి నాణ్యతా ప్రమాణాలను మోసగించే విధంగా నకిలీ నెయ్యిని తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు, అంతేకాక రసాయనాలను సరఫరా చేసినట్లు అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి అంగీకరించాడు.

నిషేధించినా ప్రాక్సీ సంస్థలతో సరఫరా

ఉత్పత్తి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో, 2022లోనే టీటీడీ ఈ భోలే బాబా డైరీని నల్లజాబితాలో ( బ్లాక్ లిస్ట్) చేర్చింది. అయినప్పటికీ అదే బృందం వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ వంటి కొత్త ప్రాక్సీ సంస్థలను స్థాపించి నకిలీ ఈ-వే బిల్లులు ఉపయోగించి నెయ్యి సరఫరాను కొనసాగించింది. జూలై 2024లో టీటీడీ తిరస్కరించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రీబ్రాండింగ్ చేసి, కొత్త లేబుళ్లతో మళ్లీ ఆలయానికి సరఫరా చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో బయటపడింది.

పరీక్షల్లో పశువుల కొవ్వు, రాజకీయ వివాదం

కాగా ప్రయోగశాల పరీక్షలు, ఫోరెన్సిక్ విశ్లేషణల్లో వెల్లడైన వివరాలు భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. సీబీఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదికల్లో టీటీడీ నెయ్యిలో పశువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా గుజరాత్‌కు చెందిన ఒక ల్యాబ్ నివేదికలో చేప నూనె, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు వంటివి కూడా ఉన్నట్లు గుర్తించారు.

ఈ దర్యాప్తులో హవాలా లావాదేవీల మరో కొత్త కోణం బయటపడింది. అయితే మాజీ టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడికి ఖాతాకు రూ 50 లక్షలు బదిలీ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కల్తీ నెయ్యి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పవిత్ర లడ్డూల తయారీలో వాడారని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు, రసాయనాల సరఫరాదారులతో సహా పలువురిని సీబీఐ/సిట్ అరెస్ట్ చేసింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో జరిగిన ఈ కల్తీపై టీటీడీ నిఘా వ్యవస్థల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేసు నేపథ్యం

2019-2023 మధ్య తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై భక్తులు, సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రుచి, వాసన, రంగులో వ్యత్యాసాలు కనిపించడంతో టీటీడీ అధికారులు నమూనాలను పరీక్షకు పంపగా, పామాయిల్‌, రిఫైన్డ్ ఆయిల్ మిశ్రమాలు ఉన్నట్లు బయటపడింది. మొదట స్థానిక స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, సరఫరా కంపెనీలు, మధ్యవర్తుల ప్రమేయం, టెండర్‌లో భారీ అవకతవకల సంకేతాలు బయటపడడంతో కేసులో మరో మలుపు తీసుకుంది. కాగా ఇది అంతర్రాష్ట్ర సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసు కావడంతో, పారదర్శక విచారణ కోసం ప్రభుత్వం కేసును సీబీఐకి బదిలీ చేసింది. తద్వారా భారీ నెయ్యి కుంభకోణం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.

తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి! - Tholi Paluku