
తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారాలు ఆపాలి: పోలీసులకు వైసీపీ ఫిర్యాదు
తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డుపై కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను వెంటనే అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు సమర్పిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
కాగా డోన్ నియోజకవర్గంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సారథ్యంలో, పార్వతీపురం, మదనపల్లి, రేపల్లె తదితర నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు తెలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వారు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, సిట్ నిర్వహించిన దర్యాప్తులో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో ఎలాంటి నేరారోపణలు నిర్ధారణ కాలేదని వైఎస్ జగన్, వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరుల పాత్ర ఎక్కడా లేనట్లు స్పష్టమైందని తెలిపారు. అయినప్పటికీ వారి ఫోటోలతో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారంతో కోట్లాది హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని, శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఫ్లెక్సీలు వెంటనే తొలగించి వాటిని ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
