
తిరుమల పవిత్రతపై 'మద్యం' కుట్ర
కలియుగ వైకుంఠం తిరుమల పవిత్రతను మంటగలిపేలా తిరుమల తిరుపతి దేవస్థానం పోలీస్ విభాగం ప్రతిష్టను దిగజార్చేలా సాగిన ఒక భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పక్కా పథకం ప్రకారం బయట నుంచి ఖాళీ మద్యం సీసాలను కొండపైకి తెచ్చి, వాటిని పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో పడేసి తిరుమలలో మద్యం ఏరులై పారుతోంది అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వైసీపీ కార్యనిర్వాహకుడు అల్లపాక కోటి, స్థానిక పత్రిక ఫోటోగ్రాఫర్ మొహనకృష్ణలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం నిందితులు తిరుమలలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేసారని, పథకం ప్రకారం నిందితులు బయట మార్కెట్‌లో కొన్ని పాత మద్యం సీసాలను కొనుగోలు చేసి వాటిని తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ వెలుపల ఉన్న చెట్ల పొదల్లో విసిరారు. అనంతరం వాటిని ఫోటోలు తీసి పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలోనే మద్యం బాటిళ్లు ఉన్నాయని అలిపిరి టోల్ గేట్ వద్ద భద్రతా వైఫల్యాల వల్లే మద్యం లోపలికి చేరుతోందని జనవరి 4న సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారు. ఈ పోస్టులు వైరల్ కావడంతో భక్తులలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
ఇక ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించడం, వాహనాల రాకపోకలను ట్రాక్ చేయడం సాంకేతిక ఆధారాలను విశ్లేషించడంతో అసలు కుట్ర బయటపడింది. ఆ మద్యం బాటిళ్లకు పోలీస్ గెస్ట్ హౌస్‌కు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే పోలీస్ శాఖను, టీటీడీని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న నవీన్ అనే మరో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా తిరుమల పవిత్రతకు భక్తుల భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ యంత్రాంగం ఈ సందర్భంగా హెచ్చరించింది.
