
తిరుమల నెయ్యి వివాదం… టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న తిరుమల లడ్డు నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.
అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు ప్రస్తుత ఇన్‌చార్జ్ ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరికి తాత్కాలికంగా పూర్తి అధికారాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అనిల్ కుమార్ సింఘాల్
టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రెండు దఫాలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి 2017 మే 1న టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2020 అక్టోబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం కొన్నేళ్ల విరామం తర్వాత 2025 సెప్టెంబర్ 10న రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడా టీటీడీ పరిపాలనతో పాటు బోర్డు కార్యదర్శి (ఎక్స్-ఆఫిషియో మెంబర్ సెక్రటరీ)గా కీలక పాత్ర పోషించారు. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై సిట్ ఛార్జ్‌షీట్ దాఖలైన నేపథ్యంలోనే ఆయన రెండో దఫా ఈవోగా కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నెయ్యి వివాదంతోనే బదిలీనా?
ఈ బదిలీ వెనుక తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారమే కారణమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఇప్పటికే నెయ్యి అంశంపై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల తిరుమల లడ్డూ నెయ్యి కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన ఛార్జ్‌షీట్‌ను తిరుపతి కోర్టులో దాఖలు చేసింది. లడ్డూ తయారీలో జంతు అవశేషాలు వినియోగించలేదని సిట్ తన నివేదికలో పేర్కొంది. అయితే టెండర్ నిబంధనల సడలింపులు నెయ్యి సరఫరా విధానంపై కీలక అంశాలను సిట్ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించడం రాజకీయ దుమారానికి దారితీసింది.
టెండర్ల సడలింపులపై సిట్ కీలక వ్యాఖ్యలు
సిట్ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం 2019 ఏప్రిల్‌లో అప్పటి టీటీడీ ఈవో అనుమతితో నెయ్యి టెండర్లలో కొన్ని షరతులను సవరించేందుకు టీటీడీ అధికారులు బాహ్య డెయిరీ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2020 ఫిబ్రవరి 29న టిటిడి బోర్డు తీర్మానం నెం.371 ద్వారా నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనలకు సడలింపులు ఇచ్చింది.
ఈ సడలింపుల కారణంగా ఏ సహకార డెయిరీకి కూడా టెండర్ దక్కలేదని ప్రైవేట్ డెయిరీలకే అవకాశాలు లభించాయని సిట్ పేర్కొంది. పాలు సేకరించకుండానే డెయిరీలు టెండర్‌లో పాల్గొనే వీలుకలిగిందని అవసరమైన అనుభవం, ఖ్యాతి లేని కొత్త డెయిరీలకూ అవకాశం కల్పించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల లడ్డూ ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై రాజీ పడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది.
రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలు
ఈ వ్యవహారంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం స్పందిస్తూ టీటీడీ నుంచి ఎన్‌డీడీబీకి పంపిన నెయ్యి నమూనాల్లో జంతువుల కొవ్వు ఉండే అవకాశం ఉందని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా అదే నివేదికను ఉటంకించారని 2019 తర్వాతే కల్తీ ప్రారంభమైనట్లు సిట్ ముందు ఉన్న సాక్ష్యాలు సూచిస్తున్నాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. మరోవైపు వైసీపీ నేతలు ఈ ఆరోపణలను రాజకీయ దాడిగా కొట్టిపారేస్తూ సిట్ నివేదికను వక్రీకరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
హాట్ టాపిక్‌గా టీటీడీ ఈవో బదిలీ
సిట్ ఛార్జ్‌షీట్ దాఖలైన వారం రోజుల్లోనే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సింఘాల్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మే 2017 నుంచి అక్టోబర్ 2020 మధ్య టీటీడీ ఈవోగా పనిచేశారు.
తిరుమల వంటి అత్యంత సున్నితమైన దేవస్థానానికి సంబంధించిన అంశం కావడంతో, ఈ బదిలీపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. నెయ్యి వివాదం నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి
