
తిరుమలలో వంటశాలలకు ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు: టీటీడీ
తిరుమలలో లడ్డూ తయారీ, అన్నదానం వంటశాలలకు వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) స్పష్టం చేసింది. భక్తులు లడ్డూలను సాధారణంగానే పొందవచ్చని, ఎలాంటి పరిమితులు విధించలేదని అధికారులు తెలిపారు.
టీటీడీ వంటశాలలకు వంటగ్యాస్‌ను ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)సరఫరా చేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంను నిర్వహిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో రోజువారీగా భారీ స్థాయిలో లడ్డూల తయారీ, అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుమలలో సాధారణంగా ప్రతిరోజూ సుమారు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారు. పండుగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య దాదాపు 10 లక్షల వరకు పెరుగుతుంది. లడ్డూ తయారీతో పాటు అన్నదానం కార్యక్రమాల నిర్వహణకు రోజుకు 10 టన్నులకుపైగా వంటగ్యాస్ అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.
“తిరుమలలో వంటగ్యాస్ కొరత లేదని, సరఫరా పూర్తిగా సక్రమంగా కొనసాగుతోందని భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని” టీటీడీ అధికారి తెలిపారు. భక్తులు ఎలాంటి పరిమితులు లేకుండా లడ్డూలను పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.
లడ్డూ తయారీ, అన్నప్రసాదం తయారీ నిరంతరంగా కొనసాగేందుకు టీటీడీ ఒక వారం సరిపడే బఫర్ స్టాక్ వంటగ్యాస్ నిల్వ ఉంచుతుందని అధికారులు వెల్లడించారు. అవసరమైనప్పుడు వెంటనే వినియోగించుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. లడ్డూ పంపిణీలో మొదటిగా తిరుమలలోని భక్తులకు ప్రాధాన్యత ఇస్తారని, అనంతరం టీటీడీ సమాచార కేంద్రాలు, ముఖ్యమైన దేవాలయాలకు లడ్డూలు పంపిణీ చేస్తారని తెలిపారు.
ఇక వంటగ్యాస్ వినియోగం విషయానికి వస్తే, లడ్డూ తయారీ కేంద్రం, ప్రధాన అన్నదానం కేంద్రంలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇతర అన్నదానం కేంద్రాల్లో మాత్రం ఎల్పీజీ సిలిండర్లను వినియోగిస్తున్నారు.
ప్రధాన అన్నదానం కేంద్రంలో రోజుకు సగటున సుమారు 75,000 మందికి భోజనం తయారు చేస్తారు. తిరుమలలోని అన్ని అన్నదానం కేంద్రాలు కలిపి రోజుకు దాదాపు 2.25 లక్షల మందికి భోజనం అందిస్తున్నారు. పండుగ రోజుల్లో ఈ సంఖ్య మూడు లక్షల మందికి పైగా పెరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
