
తిరుమలలో యాంకర్ శివజ్యోతి వివాదం
కాంట్రవర్సీ న్యూస్ కు సోషల్ మీడియా అడ్డాగా మారింది. ఫాలోవర్స్, లైకులు, టిఆర్పీ ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మొన్ననే బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర మరణం అని తెలిసి అభిమానులు విషాదంలో మునిగిపోయారు, కానీ అంతకుముందే అనేక సార్లు ఆయన చనిపోయారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ విధంగా ఇంకో నిజం కాని వార్త ఈ రెండు రోజులుగా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ..?
ఇటీవల తిరుమలలో పర్యటించిన యాంకర్ శివజ్యోతి ఫ్యామిలీ, అక్కడ అన్న ప్రసాదంపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. విషయం తెలుసుకున్న శివజ్యోతి, వెంటనే క్షమాపణ కోరారు. అయినా, ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం, ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసిందని, ఆమెను తిరుమల దర్శనానికి అనుమతించకూడదని నిర్ణయించిందంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాలలో దావానంలా వ్యాపించింది. దీని వెనుక ఉన్న వాస్తవ లేమిటో చూస్తే …
తిరుమల శ్రీవారిని కలియుగ దైవం భక్తుల కొంగు బంగారంగా భావిస్తారు. ప్రస్తుతం కార్తీక మాసం ముగియడంతో తిరుపతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. మరోవైపు తిరుమలలో సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో తిరుమలలో క్యూలైన్లో ఉన్న భక్తులకు టీటీడీ అల్పహారం, టీ, పాలు మొదలైనవి అందిస్తుంటారు.
ఇటీవల యాంకర్ శివజ్యోతి తన భర్త గంగూలీ, ఆమె తమ్ముడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తిరుమలలో కంపార్ట్మెంట్లలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. అక్కడ టీటీడీ వారు క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇచ్చారు. అక్కడ వారు ప్రసాదంను తిన్నారు. అయితే.. తాము జీవితంలో తొలిసారి అడుక్కుని మరీ తిరుమల ప్రసాదం తిన్నామని, తిరుమలలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనంటూ కాంట్రవర్సీగా మాట్లాడారు. తిరుమల కాస్ట్లీ ప్రసాదం అడుక్కున్నామని కూడా వెటకారంగా మాట్లాడారు. అంతేకాకుండా తన పైత్యాన్ని రీల్స్ లా వీడియో కూడా రికార్డు చేసుకున్నారు. ఇది వారి ఇన్ స్టా అకౌంట్ లో పంచుకోగా అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
అయితే తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల దర్శనానికి ఇటీవల వచ్చిన యాంకర్ శివజ్యోతి ప్రస్తుతం స్వామి వారి ప్రసాదం పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
తిరుమల ప్రసాదంపై శివజ్యోతి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. కేవలం ఆగ్రహంతో ఆగిపోకుండా, ఆమె ఆధార్ కార్డు నంబర్‌ను తమ డేటాబేస్‌లో బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని, ఇకపై ఆమె తిరుమల రాకుండా నిషేధం విధించిందని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ మీడియా కథనాలు ప్రచురించాయి. ప్రధాన మీడియా సంస్థలు కూడా సోషల్ మీడియా వార్తలు నమ్మి పప్పులో కాలేశాయి. ఇంకేముంది ? సామాన్య జనం ఇది నిజమేనని నమ్మే పరిస్థితి ఏర్పడింది.
టీటీడీ వర్గాల సమాచారం ప్రకారం, యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును బ్యాన్ చేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా నిరాధారమైనవని, కల్పితమని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా టీటీడీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే మీడియా ముఖంగా అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. కానీ శివజ్యోతి విషయంలో టీటీడీ నుండి ఎటువంటి ప్రెస్ నోట్ విడుదల కాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కోట్లాది మంది హిందువుల విశ్వాసం కేంద్రం. భక్తులు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన, లేదా విమర్శలు చేసిన, టీటీడీ వివరణ ఇస్తుంది తప్ప, భక్తుల ఆధార్ కార్డు లు బ్యాన్ చేయడం, దర్శనానికి రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు దిగదు. కేవలం దళారీలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి విషయంలో టీటీడీ విజిలెన్స్ ఇటువంటి కఠిన చర్యలు సిఫార్సు చేస్తుంది. కేవలం విమర్శలు చేసినంత మాత్రాన ఆధార్ బ్యాన్ చేయడం అనేది టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ పుకార్లపై టీటీడీ ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డ్‌గా స్పందించారు. తాము ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగమని, సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు.
ఈ ఉదంతం మరోసారి సోషల్ మీడియా బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతుంది. కేవలం వ్యూస్, క్లిక్స్, కోసం ధృవీకరించని వార్తలను, సంచలనాత్మక థంబ్ నెయిల్స్‌తో ప్రచారం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, వ్యవస్థల పట్ల ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయి. ఒక సెలబ్రిటీ చేసిన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే వాటిని విమర్శించవచ్చు, కానీ ఏకంగా ఒక వ్యవస్థ ఆమెను నిషేధించాలంటూ ఫేక్ న్యూస్ సృష్టించడం జర్నలిజం విలువలకు విరుద్ధం.
ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితులు ఆసరాగా చేసుకుని కొంతమంది ఈ ప్రచారాన్ని లేవనెత్తినట్లు కనిపిస్తోంది. తిరుమల ప్రసాదం అనేది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, దానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా త్వరలో వైరల్ అవుతుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు శివజ్యోతి ఎపిసోడ్‌ను వాడుకున్నాయి. ఇటువంటి వార్తలు నమ్మే ముందు, అధికారిక ప్రకటనలు ఉన్నాయో లేదో సరి చూసుకోవడం మంచిది. అలాగే, బాధ్యతాయుతమైన పౌరులుగా ఇటువంటి ఫేక్ న్యూస్‌ని షేర్ చేయకుండా ఉండడం మన బాధ్యత
