Let's talk: editor@tmv.in
తిరుమలలో పంచమి సారె ఉత్సవానికి భారీగా భక్తులు

తిరుమలలో పంచమి సారె ఉత్సవానికి భారీగా భక్తులు

Dantu Vijaya Lakshmi Prasanna
26 నవంబర్, 2025

తిరుచానూరులో జరిగే వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున , మంగళవారం అత్యంత ప్రసిద్ధి చెందిన పంచమి తీర్థం (చక్రస్నానం) జరిగింది. దీనికి భారీ సంఖ్యలో యాత్రికులు హాజరయ్యారు.

అలాగే, తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిన్నటితో పవిత్రమైన పంచమి సారె ఉత్సవం ముగిసింది. అది వార్షిక సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన ఆచారం కావడం తో భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ ఆచారబద్ధమైన క్రతువును వీక్షించడానికి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుచానూరు లో కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి రోజు జరిగే పంచమి తీర్థం ఉత్సవం ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంచమి తీర్థం (చక్రస్నానం) వేడుక మధ్యాహ్నం 12.10 నుండి 12.20 గంటల మధ్య ఘనంగా జరిగింది. సుదర్శన చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి తీసుకువచ్చారు. తిరుమల నుంచి తెప్పించిన శ్రీవారి సారె తో పాటు ఆభరణాలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేకత సంతరించుకున్నాయి.

ఈ ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం తిరుమల నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె తరలి వెళ్లింది. పంచమి తీర్థం కావడంతో స్వామివారి ఆలయం నుంచి తిరుచానూరుకు సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు తర్వాత కాలినడకన తిరుమల నుంచి తిరుపతికి అక్కడి నుంచి తిరుచానూరు పసుపు మండపం దగ్గరకు చేరుకున్నారు.

పద్మావతీ దేవికి కానుకగా రూ. 1.3 కోట్ల విలువైన ఆభరణాలు

పంచమి తీర్థం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర స్వామి తన భార్యకు బంగారు కమలా హారం, 1.14 కిలోల బరువున్న రూ. 1.31 కోట్ల విలువైన ఒక అత్తి చెట్టు కానుకగా పంపారు.

డ్రై ఫ్రూట్స్, కుంకుమ పూల దండలు

పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్ కి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుని కుంకుమ, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, ఎరుపు ,పసుపు గులాబీ రేకులు, తులసి దండలు, కిరీటాలతో అలంకరించారు. నవంబర్ 26న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగుతుంది

ఈ వేడుక సజావుగా జరిగేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులను నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆలయం చుట్టూ భక్తిభావం నిండిన వాతావరణం నెలకొంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం తో భక్తులు తమ ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, పద్మావతి అమ్మవారి పంచమితీర్థ మహోత్సవం వందలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగిందన్నారు. భక్తులు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేసినందుకు టిటిడి లోని అన్ని విభాగాలను ఆయన అభినందించారు. జిల్లా పోలీసులు, శ్రీవారి సేవకులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలకు ఆయన అభినందనలు తెలిపారు..

కైశిక ద్వాదశి ఆస్థానం

ఇంతకుముందు, పవిత్రమైన కైశిక ద్వాదశి సం దర్భంగా, ఇటీవల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది.

ఉదయం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య, ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి ఆలయ వీధుల (మాడ వీధుల) గుండా ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లుల కారణంగా, ఘటా పటం మండపం లోపల స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఉగ్ర శ్రీనివాసమూర్తిని వెంకటత్తూరైవారు అంటారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి ఆయన సంవత్సరానికి ఒక్కసారి, కైశిక ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయం కంటే ముందు ఊరేగింపుగా వస్తారు.

ఊరేగింపు తర్వాత, స్వామివారిని బంగారు వాకిలి (బంగారు ద్వారం) వద్దకు తిరిగి తీసుకొచ్చారు. ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం కైశిక పురాణ పారాయణం చేస్తూ కైశిక ద్వాదశి ఆ స్థానాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. పంచ బేరాలలో (స్వామి వారి రూపాలు) ఉగ్ర శ్రీనివాస మూర్తి ఏడాది పొడవునా గర్భగుడిలో ఉండి, ఈ రోజు మాత్రమే ఊరేగింపుగా వచ్చి భక్తులను అనుగ్రహిస్తారని ప్రతీతి.

తిరుమలలో పంచమి సారె ఉత్సవానికి భారీగా భక్తులు - Tholi Paluku