Let's talk: editor@tmv.in
తిరుమలలో ‘దివ్య ఔషధ వనం’

తిరుమలలో ‘దివ్య ఔషధ వనం’

Panthagani Anusha
23 డిసెంబర్, 2025

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండలకు మరో అరుదైన ఆభరణం చేరనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో ‘దివ్య ఔషధ వనం’ ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శేషాచలం అడవుల్లో సహజంగా పెరిగే ప్రస్తుతం అంతరించిపోతున్న ఔషధ మొక్కలను కాపాడుతూ ప్రజలకు వాటి ప్రాముఖ్యతను పరిచయం చేయడమే ఈ వనం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

భారతీయ సంప్రదాయ వైద్యానికి సజీవ భాండాగారం

భారతదేశానికి చెందిన ఆయుర్వేద, సంప్రదాయ వైద్య వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ఈ దివ్య ఔషధ వనం ఒక సజీవ భాండాగారంగా నిలవనుంది. ఆధ్యాత్మికత, విజ్ఞానం, పర్యావరణ స్థిరత్వం సమన్వయంతో ఈ వనాన్ని రూపకల్పన చేయనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించడమే కాకుండా, విద్యార్థులు, పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అధ్యయన కేంద్రంగా ఉపయోగపడనుంది టీటీడీ పేర్కొంది.

13 థీమ్‌లతో ప్రత్యేక రూపకల్పన

ఈ ఔషధ వనాన్ని 13 ప్రత్యేక థీమ్ ఆధారిత మండలాలుగా అభివృద్ధి చేయనున్నారు. దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతు వనం, విశిష్ట వృక్ష వనం తదితర విభాగాల ద్వారా మానవ ఆరోగ్యం,ఆధ్యాత్మిక సంప్రదాయాలు,పర్యావరణ సమతుల్యత మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ వనాన్ని తీర్చిదిద్దనున్నారు.

జీఎన్‌సీ టోల్ గేట్ సమీపంలో అభివృద్ధి

తిరుమలలోని జీఎన్‌సీ టోల్ గేట్ సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్ల మధ్య ఉన్న 3.90 ఎకరాల విస్తీర్ణంలో ఈ దివ్య ఔషధ వనాన్ని అభివృద్ధి చేయనున్నారు. సందర్శకుల సౌకర్యార్థం నడక మార్గాలు, పార్కింగ్, ప్రాథమిక మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించి దశలవారీగా అభివృద్ధి చేపట్టనున్నారు.

శేషాచలం జీవ వైవిధ్యానికి ఊతం

ఈ ప్రాజెక్టు ద్వారా శేషాచలం అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యానికి కొత్త ఊపిరి లభించనుందని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఔషధ మొక్కల సంరక్షణలో ఇది ఒక ఆదర్శ ప్రాజెక్ట్‌గా నిలవనుందని తెలిపారు.

వచ్చే ఏడాది చివరికి అందుబాటులోకి

పనులు సకాలంలో పూర్తిచేసి 2026 సంవత్సరం చివరి నాటికి దివ్య ఔషధ వనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా తిరుమల కొండలకు మరో విశిష్ట ఆకర్షణగా ఈ దివ్య ఔషధ వనం నిలవనుందని అధికారులు పేర్కొన్నారు.

తిరుమలలో ‘దివ్య ఔషధ వనం’ - Tholi Paluku