Let's talk: editor@tmv.in
తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక ప్రార్థనలు

తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక ప్రార్థనలు

Panthagani Anusha
23 డిసెంబర్, 2025

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎల్‌వీఎం–6/ బ్లూబర్డ్ బ్లాక్–2 మిషన్ ప్రారంభానికి ముందు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ సోమవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ వాణిజ్య అంతరిక్ష రంగంలో ఇస్రో సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ఈ మిషన్ నేపథ్యంలో ఆయన ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇస్రో ఉన్నతాధికారులతో కలిసి ఆలయానికి చేరుకున్న నారాయణన్, ప్రయోగానికి ఉపయోగించనున్న ఎల్‌వీఎం–3 రాకెట్‌కు సంబంధించిన చిన్న నమూనాను స్వామివారికి సమర్పించి ఆశీస్సులు కోరారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరిగే ప్రతి కీలక ఉపగ్రహ ప్రయోగానికి ముందు తిరుమల దర్శనం చేసుకోవడం ఇస్రోలో అనుసరిస్తున్న సంప్రదాయమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

డిసెంబర్ 24న ప్రయోగం

ఈ నెల 24న శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం–3 ప్రయోగ వాహనం (ఎం–6 మిషన్) ద్వారా బ్లూబర్డ్ బ్లాక్–2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ మిషన్ పూర్తిగా వాణిజ్య ప్రాతిపదికన నిర్వహించనుండగా అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ సంస్థ రూపొందించిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఇస్రో రికార్డు ప్రయోగం

బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహం భారత భూభాగం నుంచి ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాలలో అత్యధిక బరువు కలిగిన కమ్యూనికేషన్ సాటిలైట్గా నిలవనుంది. ఈ ఘనతతో ఇస్రో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. భారీ బరువును మోయగల సామర్థ్యం ఉన్న కారణంగా ఎల్‌వీఎం–3 రాకెట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ‘బాహుబలి రాకెట్’గా పిలుస్తున్నారు.

ఈ ఉపగ్రహం ద్వారా 4జి, 5జి కమ్యూనికేషన్ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు అవకాశం ఏర్పడనుందని ఇస్రో అధికారులు తెలిపారు. ముఖ్యంగా మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సేవల విస్తరణకు బ్లూబర్డ్ బ్లాక్–2 కీలక పాత్ర పోషించనుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఇస్రో ప్రతిభ

ఈ మిషన్ విజయవంతమైతే, ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో ఇస్రో విశ్వసనీయత మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యంతో ఇస్రో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సాంకేతిక ప్రతిభను నిరూపించనుంది.

తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక ప్రార్థనలు - Tholi Paluku