
తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించొచ్చు: మద్రాస్ హైకోర్టు
మదురైలోని ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై 'దీపత్తూన్' (దీపస్తంభం) ఉన్న ప్రాంతంలో దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ అనుమతిని ఇచ్చింది. గతంలో ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కె.కె. రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ దీపస్తంభం ఉన్న స్థలం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికే చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది.
పురావస్తు శాఖతో చర్చించి ఏర్పాట్లు
కొండపై దీపం వెలిగించే సమయంలో ఎంతమంది వెళ్లాలి అనే విషయాన్ని పురావస్తు శాఖ అధికారులతో చర్చించి దేవాలయ యంత్రాంగం నిర్ణయించాలని కోర్టు సూచించింది. దీపం వెలిగించడం అనేది ఆచారంలో భాగమని, దానిని కొనసాగించాలని పేర్కొంది. ఈ తీర్పు పట్ల హిందూ మున్నాని వంటి సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. కొండపై దీపం వెలిగించాలనే భక్తుల కోరిక ఎట్టకేలకు నెరవేరిందని వారు పేర్కొన్నారు.
వివాదం నేపథ్యం ఏమిటి?
సాధారణంగా కార్తీక దీపం పండుగ సమయంలో కొండపై దీపం వెలిగించడంపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రభుత్వం, అధికారులు కొండ కింద ఉన్న దీప మండపంలోనే దీపం వెలిగించాలని, కొండపైకి వెళ్లడం పాత పద్ధతులకు విరుద్ధమని వాదించారు. కానీ, భక్తులు మాత్రం కొండపై ఉన్న స్తంభం దగ్గరే దీపం వెలిగించాలని పట్టుబట్టారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ విషయంపై పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది.
కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్
గతంలోనే జస్టిస్ స్వామినాథన్ కొండపై దీపం వెలిగించడానికి అనుమతి ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో భక్తులకు భద్రత కల్పించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సాయం తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కొందరు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం కూడా చర్చనీయాంశమైంది.
భక్తుల విజయం
తాజా తీర్పుతో తమిళనాడులోని మురుగన్ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన వాదనలను కోర్టు తిరస్కరించిందని, ఇది హిందువులలు, భక్తుల విజయమని పిటిషనర్ రాజేష్ పేర్కొన్నారు. కొండపై దీపారాధన చేయడానికి దేవాలయ యంత్రాంగం వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఇకపై ప్రతి ఏటా కార్తీక దీపం రోజున కొండపై జ్యోతి వెలిగించడానికి మార్గం సుగమమైంది.
