Let's talk: editor@tmv.in
తిరుపతి వేదికగా ‘ఏపీ ఫస్ట్’ రీసెర్చ్ సెంటర్

తిరుపతి వేదికగా ‘ఏపీ ఫస్ట్’ రీసెర్చ్ సెంటర్

Panthagani Anusha
17 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో తిరుపతి కేంద్రంగా దేశంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 'ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ఏర్పాటు కానున్న ఈ ప్రతిష్టాత్మక కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పచ్చజెండా ఊపారు. తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ విద్యాసంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి యువతలో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.

క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఏరోస్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సలహాదారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏరోస్పేస్, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ బయో టెక్నాలజీ వంటి రంగాలు అత్యంత కీలకం కానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు ఏపీ వేదిక కావాలని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కాకినాడలో ఏర్పాటు కానున్న దేశపు మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్లాంట్ వంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేస్తామన్నారు.

ఏపీ ఫస్ట్ కేంద్రం కేవలం ఒక పరిశోధనా సంస్థగానే కాకుండా యూనివర్సిటీలు, ప్రముఖ కంపెనీలు 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సీఎం ఆదేశించారు. వివిధ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేసే సరికొత్త ఆవిష్కరణలను గుర్తించి వాటిని వాణిజ్యపరంగా విజయవంతం చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యాసంస్థల కరిక్యులమ్‌ను రూపొందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించాలని తద్వారా పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన యువతను అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

డ్రోన్ టెక్నాలజీ పై ప్రత్యేక దృష్టి

ఇదే సమావేశంలో డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేకంగా చర్చించిన చంద్రబాబు, డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని డ్రోన్ ట్యాక్సీ మరియు డ్రోన్ అంబులెన్స్ వంటి ఆధునిక అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.