
తిరుపతి వద్ద స్వర్ణముఖి నదిలో విషాదం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన నలుగురు యువకులు ఆకస్మికంగా పెరిగిన ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులను తేజ (19), బాలు (18), ప్రకాష్ (17), చిన్న (15)గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, తిరుచానూరు గ్రామానికి చెందిన ఏడుగురు టీనేజ్ విద్యార్థులు సీపీఆర్ విల్లాస్ వెనుకభాగంలోని స్వర్ణముఖి నది ఒడ్డుకు పుట్టినరోజు జరుపుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు సరదాగా నదిలో ఈతకు దిగారు. ఆ సమయంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రవాహం ఉద్ధృతమైంది. విద్యార్థుల్లో ఒకరు జారి నదిలో పడిపోవడంతో అతని సోదరుడు రక్షించేందుకు దూకాడు. అయితే ప్రవాహం తీవ్రత కారణంగా ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరు కూడా కొట్టుకుపోయారు.
డీఎస్పీ బి. ప్రసాద్ మాట్లాడుతూ కొట్టుకుపోయిన నలుగురిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సోదరులు. ఒకే కుటుంబానికీ చెందిన వారుకావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. మరోవైపు తిరుపతి ఎస్‌పీ ఎల్. సుబ్బరాయుడు స్పందిస్తూ స్వయంగా గాలింపు చర్యలు పర్యవేక్షించారు. అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ఈతగాళ్ల సహకారంతో మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగించడంతో పాటుగా డ్రోన్ కెమెరాలు, రక్షణ పరికరాలు ఉపయోగించి విస్తృతంగా నది పరిసరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో శనివారం ఉదయం నాటికి మరో ఇద్దరి మృతదేహాలను వెలి తీసినట్లు తెలిపారు. ఇక మిగిలిన ఒకరి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, వర్షాకాలంలో ప్రవాహం బలంగా ఉన్నప్పుడు నదులు, చెరువులు, వాగుల్లో ఈతకు దిగకూడదని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నదీ తీర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషాదకర సంఘటన ప్రాంతాన్ని దుఃఖంలో ముంచెత్తగా చిన్న సరదా వేడుక ఒక కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే దుర్ఘటనగా మారింది.
