Let's talk: editor@tmv.in
తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం - వై.వి. సుబ్బారెడ్డి వర్సెస్ చంద్రబాబు

తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం - వై.వి. సుబ్బారెడ్డి వర్సెస్ చంద్రబాబు

Dantu Vijaya Lakshmi Prasanna
28 నవంబర్, 2025

అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతుంది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి వివాదం పై వస్తున్నఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటుచేసి తన డిమాండ్ లను తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులున్న పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని గతకొన్నాళ్లుగా రాజకీయ యుద్ధాల్లోకి లాగుతున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి ఒక తప్పుదోవపట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. టీటీడీ వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఎలాంటి ల్యాబొరేటరీ ఆధారాలు లేకుండా, సిట్ విచారణ జరుగుతూ ఉండగానే అనుమానాస్పదమైన లీకులతో, ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. ఇది టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాక, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. చంద్రబాబు ఆరోపించినట్టు జూన్ లో వచ్చిన ట్యాంకర్ల నెయ్యి ప్రసాదంలో వినియోగించారా? వినియోగించిన ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారణ జరిగిందా? దీనిపై ఇంతవరకూ సమాధానం లేదు అన్నారు వైవి సుబ్బారెడ్డి.

ఈ విషయంపై వివరణ ఇస్తూ.. నేను టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన కాలంలో నెయ్యి ల్యాబొరేటరీని 80లక్షలతో మరింత బలోపేతం చేశాం, ఎన్ డిడిబి ల్యాబ్ నుంచి కన్సల్టేషన్ తీసుకున్నాం, L1, L2, VIP బ్రేక్ దర్శనాలను పూర్తిగా నిలిపివేశాం. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పూర్తిస్థాయిలో అమలు చేశాం. గోశాలలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాం, టీటీడీ గోశాల నుంచి సేకరించిన నెయ్యిని స్వామివారి నైవేద్యాలకు వినియోగించాం. దళారీలను అరికడుతూ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశాం. టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం కూడా విడుదల చేశామన్నారు.

చంద్రబాబు హయాంలో టీటీడీ నిధులను ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేశారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ నిధులన్నిటినీ ప్రైవేటు బ్యాంకు నుంచి ఉపసంహరించి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేశాం. విచిత్రంగా దాని తర్వాత కొద్దిరోజుల్లోనే ఆ బ్యాంకు దివాళా తీసింది. అయితే ఈ అంశాన్ని మేము రాజకీయం చేయలేదు. ఎందుకంటే ఇది టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన విషయమన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రణాళికా లోపం వల్ల, బాధ్యతారాహిత్యం వల్ల ఇటీవల వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రభుత్వం నేడు భక్తి, బాధ్యతల గురించి లెక్చర్లు ఇస్తోంది. అందుకే వాస్తవాలను ధృవీకరించుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని, టీటీడీ యంత్రాంగాన్ని, మీడియాను కోరుతున్నాను. సర్టిఫైడ్ ల్యాబ్ రిజల్ట్స్ ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ప్రభుత్వం తిరుపతి లడ్డూ ప్రసాదంపై గత కొన్నాళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో అంటే, యానిమల్ ఫ్యాట్ అని చంద్రబాబు అన్నారు. రెండిట్లో ఏది నిజం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి ట్యాంకర్లు లడ్డూ తయారీలో అసలు ఉపయోగించారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. దీనిపై సిట్ విచారణ జరుగుతూ ఉండగానే లీకుల పేరుతో మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. కల్తీ నెయ్యి కావడం వల్లే తక్కువ ధరకు వచ్చిందని మరో దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. మరి చంద్రబాబు హయాంలోనూ నెయ్యి ఖరీదు ఎక్కువగా ఏమీ లేదే? అంటే అది కూడా కల్తీ నెయ్యేనా? సిట్ విచారణ 2019-24 కాలానికే ఎందుకు పరిమితం చేస్తున్నారు? 2025, జూలైలో తిప్పి పంపిన నెయ్యి ట్యాంకర్లు.. మళ్లీ ఆగస్టులో లోపలికి వచ్చాయని సిట్ రిపోర్టు వుంది దాన్ని బయటపెట్టండి అన్నారు. అలాగే అంతకు ముందు చంద్రబాబు హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై కూడా విచారణ చేయాలని మేం సిట్ ను డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

.

తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం - వై.వి. సుబ్బారెడ్డి వర్సెస్ చంద్రబాబు - Tholi Paluku